Tuesday, April 30, 2024

Big Story: పత్తి, మిర్చి పసిడి పంటలు.. ఈసారి రికార్డు స్థాయిలో ధరలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఈ ఏడాది మిర్చి, పత్తి పంటల ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. రైతుల వద్ద మాత్రం అమ్మేందుకు పంట లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి 3,52,887 ఎకరాల్లో సాగు కాగా దిగుబడి మాత్రం ఆశించిన మేర రాలేదు. పత్తి రాష్ట్ర వ్యాప్తంగా 46.42లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే రెండు పంటల దిగుబడులపై వాతావరణ ప్రభావం తీవ్రంగా పడడంతో పాటు మిర్చికి సోకిన కొత్త వైరస్‌ వలన దిగుబడి సగానికి రెండింతలు పడిపోయింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా పత్తి, మిర్చికి డిమాండ్‌ పెరగడంతో ధరలు అధికంగా పలుకుతున్నాయి. ధరలు ఎంత పలికినా.. విక్రయించేందుకు రైతు దగ్గర పంట లేకపోవడంతో అన్నదాతలు నిట్టూర్చుతున్నారు.

ఎగుమతికి సరిపడాలేని పంటలు..

ప్రతీ ఏటా మిర్చి దేశ వ్యాప్తంగా 37శాతం సాగవుతుంది. ఈ సారి కూడా పంట అధిక విస్తీర్ణంలో సాగైనప్పటికీ దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. వాస్తవానికి ఎకరానికి సుమారు 20 క్వింటాళ్లు దిగుబడి రావాల్సిన మిర్చి ఈసారి కేవలం రెండు మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్ష ప్రభావం, వైరస్‌లతో పంట మధ్యలోనే రైతులు తీసేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ సారి ఎగుమతికి సరిపడా పంట లేదు.

మన దగ్గర సాగయ్యే మిర్చి రష్యా, అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుంది. కానీ ఈసారి అక్కడి డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లయ్‌ లేకపోవడం, దేశ వ్యాప్తంగా కూడా పంట తగ్గడంతో మిర్చికి ఒక్కసారిగా ధర పెరిగింది. ధర పెరిగే సమయంలో రైతుల దగ్గర కేవలం 3 నుంచి 4శాతం మేరకు మాత్రమే పంట ఉంది. ఇప్పటికే 95శాతం పంట విక్రయం జరిగింది.

అంతర్జాతీయంగా తగ్గిన పత్తి సాగు..

- Advertisement -

వాస్తవానికి ఈ ఏడాది అంతర్జాతీయంగా పత్తి సాగు తగ్గింది. ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో క్వింటా పత్తి రూ.10,250 వరకు ఉంది. ఈ ఏడాది పత్తి పంటకు ఆశించిన వైరస్‌లు, అధిక వర్షాల కారణంగా ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది.. కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లే వచ్చింది. అయితే డిమాండ్‌కు మేర దిగుబడి రాకపోవడంతో అధిక ధరలు పలుకుతున్నాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సౌత్‌ ఇండియా కాటన్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. భారత్‌ తర్వాత ఈజిప్టులోనే పత్తి పంట అధికంగా సాగుచేస్తున్నాయి. చాలా దేశాలకు ఎగుమతి జరుగుతుంది. అయితే పత్తి ధరలకు అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధం ఉండడంతో ధరల్లో హెచ్చు, తగ్గులు ఏర్పడుతున్నాయి.

79లక్షల క్వింటాళ్ల పత్తి, 9.74లక్షల క్వింటాళ్ల మిర్చి వ్యాపారం..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, మిర్చి వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే జరిగింది. డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి 9,47,942 క్వింటాళ్ల కొనుగోళ్లు జరగ్గా, పత్తి 79లక్షల క్వింటాళ్ల కొనుగోలు జరిగింది. ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లు కీలక వ్యాపారం జరిపాయి. దీని ప్రకారం ఖమ్మం మార్కెట్‌లో ఇప్పటివరకు మిర్చి ఈ సీజన్‌లో 5,68,828 క్వింటాళ్లు, పత్తి 2,71,828 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో ఇప్పటివరకు మిర్చి 9లక్షల బస్తాల కొనుగోళ్లు జరగ్గా, పత్తి వ్యాపారం కూడా బాగానే సాగింది.

సింగల్‌ పట్టి రకం మిర్చి రూ.42 వేలు

ఈ సీజన్‌లో ప్రస్తుతం మిర్చి ధరలు ఆల్‌టైం రికార్డులు నమోదు చేస్తున్నాయి. వరంగల్‌ మార్కెట్‌లో సింగల్‌ పట్టి రకం రూ.42,500 పలకింది. 15, 16తేదీలు రెండు రోజులు ఇదే ధర పలకడం గమనార్హం. 16వ తేదీన తేజ రకం రూ.17,900 ధర పలికింది. 341 రకం రూ.21,500 పలికింది. 15వ తేదీన తేజ రకం రూ.17,600 పలకగా, 6,500 బస్తాలు వచ్చాయి. 341 రకం రూ.21,500 పలకగా, 8వేల బస్తాలు వచ్చాయి. అధిక ధర పలికిన సింగల్‌ పట్టి రకం మాత్రం 16వ తేదీన 100, 15న 100, 14న 50 బస్తాలు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. ఖమ్మం మార్కెట్‌లో 16వ తేదీన పత్తి క్వింటా రూ.10,250 ధర పలుకగా, మిర్చి రూ.18,400 పలుకగా, 32,753 బస్తాలు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement