Sunday, April 28, 2024

అవినీతి రాజకీయాలే అంతంగా తెలంగాణలోకి ఆప్..

తెలంగాణలో అవినీతి, మాఫియా రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమిస్తుందని ఆప్ సౌత్ ఇండియా ఇంచార్జి సోమ్ నాధ్ బార్తి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సోమ్ నాధ్ బార్తి, హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హన్మకొండలో తాళ్లపల్లి సురేష్ గౌడ్, నర్సంపేటలో నవీన్ రెడ్డి సోమ్ నాధ్ బార్తి సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరారు. అనంతరం సోమ్ నాధ్ బార్తి మీడియా తో మాట్లాడారు. డిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాన్ ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు. సహజ వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో ఇంకా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. 60 ఏళ్లు కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దీని కోసమేనా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఫలాలు కేవలం కేసీఆర్ కుటుంబానికి దక్కాయని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని చేపట్టనున్న న్యాయ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాన్యుడికే అధికారం అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలకు సోమ్ నాధ్ బార్తి విజ్ఞప్తి చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్టం వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే..మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను వంచించారని ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరాశోభన్ అన్నారు. ఈ పరిస్థితి మారాలంటే..ఆమ్ ఆద్మీ పార్టీ రావాలన్నారు. తెలంగాణ పేరు చెప్పి దుష్ట రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ను గద్దె దించే సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణలోని మేధావులు, విద్యావంతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆమె చెప్పారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను ఆమె కోరారు. రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఇందిరాశోభన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ కమిటీ సభ్యులు రామ్ గౌడ్, సయ్యద్ గఫ్ఫర్, తాళ్లపల్లి సురేష్ గౌడ్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement