Wednesday, May 1, 2024

ఢిల్లీ చేరిన కేసీఆర్ కుటుంబ అవినీతి.. లిక్కర్ స్కాం దోషులకు శిక్ష తప్పదు : తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణ దాటి ఢిల్లీ చేరిందని బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. అందుకే కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ కలిశారని అభిప్రాయపడ్డారు. బుధవారం తరుణ్ చుగ్ న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత నివాసం మొదలు ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ సమావేశాల వరకు అన్నింటినీ ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొందని, సౌత్ గ్రూప్ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు, అందుకు వారికి రూ.192 కోట్ల ప్రయోజనం కలిగిందని ఈడీ పేర్కొందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అవినీతికి ఇదొక నిదర్శనమని తరుణ్ చుగ్ మండిపడ్డారు.

ఏ తప్పూ చేయకపోతే కవిత పది ఫోన్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒబెరాయ్ హోటల్ సమావేశాల్లో ఏ అంశాల గురించి చర్చించారని నిలదీశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎవరెవరున్నారో ప్రజలందరికీ తెలుసునని తరుణ్ చుగ్ అన్నారు. ఇంకా మరెన్నో నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్న తరుణ్ చుగ్, దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని నొక్కి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement