Tuesday, April 16, 2024

కోవిడ్-19 కారణంగానే చంద్రయాన్-3 జాప్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 మహమ్మారి సమయంలో లాక్ డౌన్‌తో పాటు పరికరాలు, మానవ వనరులు, సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల చంద్రయాన్ – 3 ప్రయోగంలో జాప్యం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బదులిచ్చారు. ఈ ప్రయోగంలో పటిష్టతను పెంచడానికి అదనపు పరీక్షలు, లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ వంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసినట్టు చెప్పారు. చంద్రయాన్ -1, 2, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆస్ట్రోశాట్‌తో సహా నాలుగు శాస్త్రీయ మిషన్‌లను మాత్రమే ఇస్రో నిర్వహించిందని తెలిపారు.

అంతరిక్ష రంగం కోసం సమగ్రమైన, విస్తృతమైన విధానాన్ని రూపొందించే ప్రక్రియలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఉందని, ఇది అంతరిక్ష విజ్ఞానం,  గ్రహాల అన్వేషణతో సహా స్పేస్ డొమైన్‌లోని కార్యకలాపాల వివిధ అంశాలను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. శాస్త్రీయ మిషన్ల కంటే వాణిజ్య ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలపై ఎంపీ ప్రశ్నించగా మంత్రి బదులిస్తూ మనిషి సాంకేతిక రంగంపై ఆధారపడినందున ఇస్రో కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయని, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, నావిగేషన్ మొదలైన సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలోనే వాణిజ్య ప్రయోగాలు చేపట్టినట్టు వివరించారు. అదే సమయంలో శాస్త్రీయ మిషన్లకు తగినంత నిధులు సమకూరుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement