Wednesday, December 4, 2024

అలర్ట్: మరోసారి లక్ష దాటిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో రెండో వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. నిన్న ఏకంగా 1,15,249 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 630 మంది ప్రాణాలను కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం నాడు 54 వేలకు పైగా పెరిగి, అత్యధిక ఒక రోజు రికార్డును నమోదు చేయగా, ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు వచ్చాయి. ఇక గడచిన 48 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరగడమే ఇందుకు నిదర్శనం. కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఇదే తొలిసారి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు 2వేలకు చేరువలో ఉన్నాయి. కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 2వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా.. 1,941 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement