Wednesday, May 1, 2024

Congress Campaign – ఆ మూడు పార్టీలు ఒకటే – ఓటుతో వాటికి బొంద పెట్టండి – రేవంత్ రెడ్డి

దేవరకద్ర,నవంబర్ 26 (ప్రభ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మారుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలో ఆదివారము బాలుర కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విజయ బేరి సభకు హాజరై ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా మారుస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జాతీయ హోదా కల్పిస్తామని తద్వారా సాగునీరు,తాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయం లోనే కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ నాగార్జున సాగర్ జూరాల ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము మేము కట్టిన ప్రాజెక్టులకు పూలుచల్లి మేము నిర్మాణం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో భాజపా,బారాస ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని ఈ పార్టీలు ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ గాలి చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలో ప్రజలు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన అన్నారు. నన్ను చూసి కామారెడ్డిలో కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అలాగే పాలమూరు జిల్లాను దేశంలో ఆదర్శ జిల్లాగా మారుస్తామని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తాగునీరు అందించి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఇందిరామ్మ రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటు వేసి దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.

తదుపరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతాదయాక్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి , అంజిరెడ్డి, హనుమంత్ రెడ్డి, చామన్, స్వప్న కిషన్ రావు, విజయ సారథి రెడ్డి, జగదభి రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, గోపాల శర్మ వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు పాల్గొన్నారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement