Saturday, April 27, 2024

Delhi: అమరావతి కేసు విచారణకు సీజేఐ విముఖత.. మరో ధర్మాసనానికి పిటిషన్ల బదిలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజధానిగా అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని పేర్కొంది. అమరావతిగా రాజధాని ఉండాలంటూ రైతులు, రాజధాని పరిరక్షణ సమితి… మరోవైపు ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా వేసిన పిటిషన్లపై మంగళవారం సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది.

అయితే నాట్ బిఫోర్ మీ అంటూ సీజేఐ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. వీలైనంత త్వరగా విచారణకు అనుమతినివ్వాలని అన్నారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలో తాను అభిప్రాయాన్ని వెల్లడించానని గుర్తు చేశారు. దీంతో అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ వేరే బెంచ్‌కు బదిలీ అయింది. ఈ పిటిషన్ల విచారణ మరో ధర్మాసనం ఎదుట జరగనుంది.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. రాజధాని కోసం భూముల సేకరణలో అవకతవకలు జరిగాయని, అమరావతిలో రాజధాని నిర్మాణం కంటే వికేంద్రీకరణ ఖర్చు తక్కువని చెబుతోంది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని, పాదయాత్రను అడ్డుకోవడం, దాడులు చేయడం మానుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కీలక మలుపులు తిరుగుతున్న రాజధాని పిటిషన్ల విచారణ సర్వోన్నత న్యాయస్థానం ముందుకు మళ్లీ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement