Friday, May 3, 2024

సిటీ టూ విలేజ్.. ఐటీ విస్త‌ర‌ణ‌తో పెరిగిన రియల్ భూమ్..

తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసిన, ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లు, ఇండస్ట్రియల్‌ పార్కుల కారణంగా అక్కడి భూముల విలువలు ఒక్కసారిగా పెరగడంతో పాటు నిర్మాణ రంగం కూడా ఊపందుకున్నట్లు పరిశ్రమల శాఖవర్గాలు చెబుతున్నాయి.

పారిశ్రామిక పార్కుల్లో వచ్చిన పెట్టుబడుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే 45వేల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించినట్లు అంచనాలున్నాయి. ఈ తరహాలో అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుండడంతో రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్త గృహాలకు డిమాండ్‌ ఏర్పడుతోందని క్రెడాయ్‌ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ నగరంలో ఇంటి స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేద్దామనుకున్న వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం వారి వారి పట్టణాలకే పరిమితమవుతున్నారని క్రెడాయ్‌ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్‌, విల్లాల సంస్కృతి ప్రస్తుతం రామగుండం, మంచిర్యాల, జహీరాబాద్‌, నల్గొండ, సూర్యాపేట లాంటిచోట్ల కూడా జోరందుకుందని చెబుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇటీవలి కాలంలో ఉద్యోగాల నుంచి రిటైర్‌ అయిన వారు కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేయడం కంటే వారి వారి సొంత పట్టణాల్లో శేష జీవితం గడిపేందుకే మొగ్గు చూపడం కనిపిస్తోందని రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు చెబుతున్నారు. ఓ వైపు పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరగడం మరోవైపు కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారుతుండడంతో రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో రియాల్టి రంగం ఊపు మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement