Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ చింతన్ శిబిర్.. ‘ఔషధ నాణ్యత నియంత్రణ’ మేథోమధనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఔషధ నాణ్యత నియంత్రణ – అమలు’ అంశంపై కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రెండ్రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఆదివారం ప్రారంభం కానున్న ఈ మేథోమధన సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా అధ్యక్షత వహించనున్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఔషధ రంగ నిపుణులైన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, అంకుర విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి మాండవియాతో పాటు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్ పవార్‌, ఎరువులు-రసాయనాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవంత్‌ ఖూబా, నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్‌ వి.కె.పాల్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కేంద్ర ఆరోగ్య, ఆయుష్‌, డీజీహెచ్‌ఎస్‌ (ఔషధ) శాఖలు, విభాగాల కార్యదర్శులు సహా సీనియర్‌ అధికారులు, నేషనల్ హెల్త్ అథారిటీ, ఎన్‌పీపీఏ, సీడీఎస్‌సీఓ, ఎన్‌ఐబి, ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఎన్‌ఐపీఈఆర్‌ తదితర సంస్థల ప్రతినిధులు, ఏసీఎస్‌, ముఖ్య కార్యదర్శి సహా రాష్ట్ర స్థాయి అధికారులు ఈ రెండు రోజుల మేథోమధన సదస్సులో పాల్పంచుకుంటారు. హైదరాబాద్‌లోని శాంతివనం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

దేశంలో ఔషధ నాణ్యత సంబంధిత విధానాలతో పాటు అమలు తీరుతెన్నులను సమీక్షించడం ఈ రెండు రోజుల చింతన శిబిరం లక్ష్యం. భారతీయ ఔషధ ప్రమాణాలు, కేంద్ర-రాష్ట్రాల పరిధిలో నియంత్రణ సామర్థ్యాలపై అంచనా సహా పారదర్శకత, కట్టుబాటు తదితర అంశాలను ఈ సదస్సు సమీక్షిస్తుంది. అనంతరం ఈజ్ ఆఫ్ బిజిసెన్ డూయింగ్ విధానాలపై సిఫార్సులు చేస్తుంది. మరోవైపు ప్రపంచ స్థాయిలో ఉత్తమ పద్ధతులు, డిజిటల్‌ ఉపకరణాల వంటి కొత్త ఆవిష్కరణల పరిచయం, ఔషధ ప్రయోగ పరీక్షల ప్రమాణాలు తదితర అంశాలపై కూడా ఇందులో పాల్గొంటున్న నిపుణులు చర్చిస్తారు. తద్వారా సామాన్య పౌరుల ప్రయోజనాల దిశగా బహుళ-భాగస్వామ్య విధానాల రూపకల్పన చేయనున్నారు.

- Advertisement -

ఈ చింతన్ శిబిరంలో కింది అంశాలపై ఐదు భాగాలుగా చర్చాగోష్ఠి జరగనుంది:

దేశీయ, ఎగుమతి మార్కెట్లలో మందులు, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాల నాణ్యతపై నమ్మకం-విశ్వాసం ప్రోదిచేయడం.
కేత్రస్థాయిలో విధానాలను సమర్థవంతంగా అమలుచేయడం
భారతీయ ఔషధ సంహిత, అది నిర్దేశించే నాణ్యత ప్రమాణాలకు కట్టుబాటు
అన్ని నియంత్రణ కార్యకలాపాలలో ఏకీకృత సమాచార సాంకేతికత వినియోగం
జాతీయ, రాష్ట్రస్థాయి నియంత్రణ వ్యవస్థల సామర్థ్యం పెంపు

ఈ సదస్సులో భాగంగా ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, పారిశ్రామిక వేదిక, అంకుర సంస్థలు, విద్యా సంస్థలు తదితర రంగాల ప్రముఖ వక్తలు, నిపుణుల మధ్య చర్చలు సాగుతాయి. అలాగే భాగస్వామ్య పక్షాల మధ్య పరస్పర చర్చాగోష్ఠులు కూడా ఉంటాయి. నిర్దిష్ట వ్యవధి మేరకు విధానాలు, కార్యక్రమాల అమలుకు తగిన భాగస్వామ్య విధానం రూపకల్పన లక్ష్యంగా భాగస్వాముల మధ్య పరస్పర చర్చకు ఈ గోష్ఠులు వేదికలవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement