Thursday, May 2, 2024

New Scheme – చేతివృత్తుల వారికి విశ్వకర్మ పథకం – కేంద్ర కేబినెట్ ఆమోదం ..

న్యూ ఢిల్లీ – స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించగా.. నేడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇస్తారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్‌లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. గరిష్ఠంగా 5 శాతం వడ్డీతో ఈ రుణాలు పొందవచ్చు. ఇందుకు రూ.13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనుందన్నారు. దీంతో 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. చేతివృత్తుల వారికి రోజుకు రూ.500 ఉపకారవేతనంతో మెరుగైన శిక్షణ ఇస్తామని, శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆ తర్వాత రాయితీతో తొలుత రూ.1 లక్ష రుణం వడ్డీపై ఇస్తామని, తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండోవిడత ఇస్తామన్నారు. ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

దేశంలో రైల్వే లైన్ విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్ వర్క్‌ను రూ.32,500 కోట్లతో విస్తరించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడం, రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు పీఎం ఈ-బస్ సేవ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10వేల ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 169 నగరాల్లో ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఇందుకు రూ.57,613 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.20 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
డిజిటల్ ఇండియా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 5.25 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకు రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement