Saturday, April 27, 2024

సామాన్యుడికి సిమెంట్‌ షాక్‌.. భారీగా పెరిగిన ముడి పదార్థాల ధరలు – ఇక సొంతిల్లు కలే!?

న్యూఢిల్లి : సామాన్యుడిపై మరో భారం పడనుంది. ఇప్పటికే నిత్యవసర ధరలు, పెట్రోల్‌, డీజెల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ కారణంగా వంట నూనె ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కీలక ముడి సరుకులు దిగుమతి కావడం లేదు. దీంతో స్థానికంగా పలు వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా సిమెంట్‌ కూడా చేరనుంది. సొంతిళ్లు ఇళ్లు కట్టుకోవాలని భావించే వారికి ఈ వార్త మరింత కన్నీరు పెట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రష్యా-ఉక్రెయిన్‌ వివాదం కారణంగా.. దిగుమతి చేసుకున్న బొగ్గు, పెట్‌ కోక్‌, ముడి చమురు ధరల పెరుగుదల తరువాత.. దేశీయ సిమెంట్‌ ధరలు దేశ వ్యాప్తంగా 6-13 శాతం పెరిగే అవకాశం ఉంది.

12 నెలల్లో రూ.390 పెంపు..

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా.. గత 6 నెలల్లో బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు 30-50 శాతం పెరిగాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం.. ఆలిండియా స్థాయిలో గత 12 నెలల్లో బ్యాగ్‌కు రూ.390 పెరిగాయి. సిమెంట్‌ తయారీదారులు పెరుగుతున్న ముడి సరుకుల ధరల కారణంగా.. తమ ఉత్పత్తుల ధరలు కూడా పెంచాలని నిర్ణయించుకున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే.. తమ ఉత్పత్తులు ధరలు కూడా పెంచడం అనివార్యం అవుతున్నదని వివరించారు. ఏప్రిల్‌లో సిమెంట్‌ ధరలు బస్తాపై రూ.25 నుంచి 50 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ ప్రారంభం నుంచే.. కొన్ని ప్రాంతాల్లో.. సిమెంట్‌ కంపెనీలు తమ ధరలను పెంచేశాయి. ఏప్రిల్‌ చివరి నాటికి.. దేశ వ్యాప్తంగా సిమెంట్‌ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్‌ రిపోర్టు తెలియజేస్తున్నది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణమని సిమెంట్‌ తయారీ పరిశ్రమలు చెబుతున్నాయి.

రోడ్డు మార్గాన.. సిమెంట్‌ రవాణా..

మార్చిలో.. పెట్‌కోక్‌తో పాటు సిమెంట్‌ తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 43 శాతం పెరిగాయి. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య ధరలు క్షీణించాయి. తరువాత ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ముడి చమురు ధర చూసుకుంటే.. గతేడాది 79 డాలర్లు ఉంటే.. ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. గ్యాస్‌ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. క్రిసిల్‌ రిపోర్టు ప్రకారం.. దేశంలో సిమెంట్‌ రవాణా.. రోడ్డు మార్గం ద్వారానే జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వాహనాల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఇంధన ధరల పెరుగుదల సిమెంట్‌ ధరల పెరుగుదలకు పరోక్షంగా కారణం అవుతున్నది.

- Advertisement -

ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌పై ప్రభావం..

కనోడియా సిమెంట్‌ ఎండీ విశాల్‌ కనోడియా మాట్లాడుతూ.. బొగ్గు, పెట్‌ కోక్‌ అనేవి.. సిమెంట్‌ తయారీలో ఎంతో కీలకం. సిమెంట్‌ తయారీలో ఉపయోగించే కీలకమైన ముడి పదార్థాలు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్రోల్‌, డీజెల్‌ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. ఇది సిమెంట్‌ ముడి పదార్థాలు, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ ఉత్పత్తిపై ప్రభావం పడ్డాయి. ధరను చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. క్రూడాయిల్‌ ధరల మాదిరిగానే.. పెట్‌ కోక్‌, కోల్‌ ధరలు కూడా పెరిగాయి. మార్చిలో 43 శాతం పెరిగిన పెట్‌కోక్‌ ధరలు.. గత ఆర్థిక సంవత్సరంలో.. యూఎస్‌ పెట్‌కోక్‌ ధరలు 96 శాతం పెరిగాయి. దేశీయ పెట్‌కోక్‌ ధరలు (గుజరాత్‌ ఎక్స్‌-రిఫైనరీ) అదేవిధంగా ఉన్నాయి. మార్చిలో నెలకు 26 శాతం, ఏప్రిల్‌లో నెలవారీగా 21 శాతం పెరిగాయి. ఇది సముద్ర మార్గంలో దిగుమతి అవుతుంది. ప్రస్తుతం రవాణాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

పరిశ్రమల్లో నిండుకున్న నిల్వలు..

2022-23 ఆర్థిక సంవత్సరంలో.. సిమెంట్‌ వాడకంలో వృద్ధి 5-7 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఇది మౌలిక సదుపాయాలతో పాటు టైర్‌-2, టైర్‌-3 నగరాల నుంచి సరసమైన గృహాల డిమాండ్‌తో నడపబడుతుంది. అయినప్పటికీ.. అధిక నిర్మాణ ఖర్చు డిమాండ్‌ పెరుగుదలను పరిమితం చేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో.. డిమాండ్‌ 20 శాతం పెరిగినప్పటికీ.. అకాల వర్షాలు, ఇసుక సమస్యలు, కార్మికుల కొరత వేధించాయి. ఫలితంగా సిమెంట్‌ వాడకం 7 శాతం తగ్గింది. సౌత్‌ ఇండియా సిమెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే ప్రధాన మూడు ఇన్‌పుట్‌ ఖర్చులు ఇంధనం, విద్యుత్‌, రవాణా ద్వారా దెబ్బతింటుందని పేర్కొంది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులు బొగ్గు రవాణాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అన్ని కంపెనీల వద్ద సిమెంట్‌ స్టాక్‌ పరిమితంగా ఉన్నట్టు సౌత్‌ ఇండియా సిమెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. పెట్‌కోక్‌, కోల్‌ కారణంగా కొన్ని సిమెంట్‌ తయారీ పరిశ్రమలు ఉత్పత్తిని నిలిపేశాయి. గత రెండు-మూడు నెలల్లో బస్తా సిమెంట్‌పై రూ.70-75 పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement