Saturday, April 27, 2024

ఈ దశలో జోక్యం చేసుకోలేం.. జీవో నెంబర్ 1పై కేసులో సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివాదాస్పద జీవో నెంబర్ 1పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. జీవో నెంబర్ 1 ను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పి. నరసింహ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోందని, ఈ నెల 23న తదుపరి విచారణ చేపట్టనుందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని ధర్మాసనం పేర్కొంది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు వాదప్రతివాదులు తమ వాదనలు వినిపించవచ్చని తెలియజేసింది.

ఈ దశలో పిటిషనర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ జోక్యం చేసుకుంటూ.. ఈ కేసు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ పరిధికి సంబంధించిన అంశమని,  పాలనాపరమైన వ్యవహారాలపై విచారణ చేపట్టే పరిధి వెకేషన్ బెంచ్‌కు లేదని తెలిపారు. హైకోర్టు కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలకు నోటీసులు కూడా ఇవ్వకుండా.. ఉదయం ప్రస్తావిస్తే మధ్యాహ్నం విచారణ చేపట్టి స్టే ఇవ్వడం సరికాదని వాదించారు. అయితే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్న తర్వాతనే బెంచ్ నిర్ణయం తీసుకుందని ప్రతివాది రామకృష్ణ తరఫు న్యాయవాదులు తెలిపారు. తాము కేసులో మెరిట్స్ జోలికి వెళ్లడం లేదని, అన్ని అంశాలను తెరిచే ఉంచుతున్నామని ధర్మాసనం వివరించింది.

జాతీయ రహదారుల నుంచి మున్సిపల్, గ్రామీణ రహదారుల వరకు రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను, వెకేషన్ బెంచ్ విచారణ పరిధిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement