Saturday, May 4, 2024

Delhi | పార్లమెంట్ సభ్యత్వ రద్దు ఓ కుట్ర.. రాహుల్‌ను ఆపలేరు-అణచివేయలేరు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఓ కుట్ర అని, గాంధీ కుటుంబ గొంతు నొక్కే ప్రయత్నమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని అభివర్ణించారు. ఎన్నికుట్రలు చేసినా రాహుల్ గాంధీని ఆపలేరని, అణచివేయలేరని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 1978లో ఇందిరాగాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఎటువంటి పరిమాణాలు వచ్చాయో అదే గతి బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. సూరత్ కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును అప్పీల్ చేసే సమయం ఇవ్వకుండా అనర్హత వేటు వేయడం దుర్మార్గమైన చర్యని ఆరోపించారు.

- Advertisement -

ఎన్నో సంవత్సరాలుగా గాంధీ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత బీజేపీకి భయం పెరిగిందని, పార్లమెంట్‌లో మోడీ-అదానీ గురించి మాట్లాడిన తర్వాత ఆ భయం ఇంకా పెరిగిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ఆరోపణలను రాహుల్ గాంధీ ధీటుగా ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. కర్ణాటక కోలార్‌లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్‌లో కేసు పెట్టారని, జిల్లా కోర్టు న్యాయమూర్తిని మార్చి తప్పుడు తీర్పుతో అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు.  

పావు గంటలో అనర్హత వేటుకు సరిపడా రెండేళ్ల గరిష్ట శిక్ షాకాలాన్ని కుట్రపూరితంగా విధించారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు వీధి పోరాటాలు చేస్తారని తెలిపారు. దేశంలో మార్పు వస్తోందని,  రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై పై కోర్టులు స్టే ఇస్తాయని, ఆయన మళ్ళీ పార్లమెంట్‌కు వస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement