Thursday, May 16, 2024

Delhi | కనీసం 21 మంది అభ్యర్థుల పేర్లు చెప్పగలవా? బండి సంజయ్‌కు పొన్నం ప్రభాకర్ సవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో గెలుస్తామని ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు బండి సంజయ్ కనీసం 21 మంది అభ్యర్థుల పేర్లు చెప్పగలరా అంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామని ఆయనన్నారు. శనివారం ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో జరగనున్న ’17వ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్’లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బీజేపీ ఒకటేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌లా వ్యవహరిస్తోందంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అన్న మాదిరిగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తుంటాయని అన్నారు. పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తమకు ఆహ్వానమే అందలేదని చెబుతున్న కేసీఆర్, అందుకు ఆయన వ్యవహారశైలే కారణమని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవాళ్లపై బీజేపీ ఐటీ దాడులు, ఈడీ కేసులతో బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించారు. అధికార బలంతో కాంట్రాక్టులు ఇచ్చి బీజేపీలో చేర్చుకుంటోందని అన్నారు.

జులై 8న వరంగల్ పర్యటన సందర్భంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రధాన మంత్రి సందర్శించనున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిదా లేక రాష్ట్ర ప్రభుత్వానిదా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు మంజూరు చేసిన మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ టెక్స్‌టైల్ పార్కు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినట్టు ప్రకటించుకుంటోందని, ఈ క్రమంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement