Saturday, May 4, 2024

మండుతున్న ఎండలు, పెరుగుతున్న వడదెబ్బ బాధితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడదెబ్బ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, సూర్యతాపాన్ని లైట్‌ తీసుకుంటే ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు జనం, విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే గడిచిన నాలుగు నెలలుగా కరోనా వ్యాప్తి పరిస్థితులు దాదాపు తొలగిపోవటంతో ఇప్పుడిప్పుడే జనం సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతోపాటు మార్చి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలు మండిపోతుండటంతో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వ్యాపారాలు, ఉద్యోగాల కోసం జనం తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

గడిచిన రెండేళ్లతోపోలిస్తే ఈ ఏడాది మార్చి నుంచే కనీసం 5నుంచి 6 డిగ్రీల మేర ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు వీస్తుండటంతో వడదెబ్బ, జ్వరం, నీరసంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ సంఖ్య ఏప్రిల్‌ మూడోవారం నుంచి మే నెలలో ఇంకా పెరిగే అవకాశం ఉందని కేర్‌ ఆస్పత్రి వైద్యులు డా. రాహుల్‌ అగర్వాల్‌ చెబుతున్నారు. రానున్న రెండు నెలలపాటు ఎండగ తీవ్రత మరింతగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయిలో పెరిగినందున ప్రజలంతా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రతను లెక్కచేయకుండా పగటిపూట ఎక్కువగా ఆరుబయట, రోడ్లపై గడిపితే బ్రెయిన్‌ స్ట్రోక్‌, డీ హైడ్రేషన్‌, డయేరియా వంటి ప్రమాదకర అనారోగ్య పరిస్థితులు దాడి చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రులకు వడదెబ్బతో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో రోజులో కనీసం ఐదు వడదెబ్బ కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు ఉస్మానియా ఆస్పత్రిలోనూ వడదెబ్బబారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతోంది.

వడదెబ్బ బారిన పడిన వారిలో స్వల్ప జ్వరం, నీరసం, గొంతు, నాలుక తడారిపోవటం, డీహైడ్రేషన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వడడెబ్బ బారిన పడితే కొన్ని సందర్భాల్లో బ్రెయిన్‌, హార్ట్‌ స్ట్రోక్‌ వంటి తీవ్ర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిజామాబాద్‌ క్రిటికల్‌ కేర్‌ విభాగం అధిపతి డా. కిరణ్‌ మాదల హెచ్చరిస్తున్నారు. ఎండలు మండిపోతున్న ఈ పరిస్థితుల్లో… పగటి పూట ఆరు బయట, రోడ్లపై గడపటాన్ని వీలైనంత మేర తగ్గించాలి. ఎక్కువ నీటిని తాగటం, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి. వదులైన వస్త్రాలను ధరించాలి, ముఖ్యంగా కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. ఏసీ ల కింద గడిపేవారు బయట ఉష్ణోగ్రతలకు, లోపలి గది ఉష్ణోగ్రతలకు కొద్దిపాటి తేడానే ఉండేలా చూసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement