Friday, May 17, 2024

త్వ‌ర‌లో బీజేపీలో చేర‌నున్న మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర మరోసారి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌ బీజేపీలో చేరారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన మాజీమంత్రి కృష్ణాయాదవ్‌ బీజేపీలో చేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సదరు మాజీ మంత్రి బిజెపిలో చేరికపై చర్చలు కూడా జరిపారు. అన్నీ అనుకూలిస్తే వారం రోజుల్లోనే కృష్ణాయాదవ్‌ కాషాయకండువాను కప్పుకోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. పూర్వ హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో బీజేపీ సీనియర్‌ నేత టైగర్‌ ఆలె నరేంద్రపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో 2016లో ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు అనుకున్న అవకాశాలు రాలేవని అసంతృప్తితో వున్న యాదవ్‌ బిజెపిలో చేరేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది. కృష్ణాయాదవ్‌ అంబర్‌పేట నియోజక వర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఆ అవకాశం లేకపోవడం కూడా ఆయన పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. అంబర్‌పేట నుండి గత అసెంబ్లి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుండి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తే తిరిగి ఎంపీగానే పోటీ చేయనున్నారు.

ఈ క్రమంలో అంబర్‌పేట నుండి బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. ఇదే జరుగుతుందని భావించి కృష్ణాయాదవ్‌ బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరడానికి సిద్దంగా ఉన్న కృష్ణాయాదవ్‌ కొన్నాళ్ళుగా ఈటల రాజేందర్‌తో వరుస భేటీలు జరుపుతున్నట్లు సమాచారం. అంబర్‌పేట నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇస్తే ఇప్పటికిప్పుడు కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమని ఈటలతో కృష్ణా యాదవ్‌ అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణాయాదవ్‌ హస్తముందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2003లో అరెస్టయిన ఆయన మూడున్నరేళ్లు యరవాడ జైలులో శిక్ష కూడా అనుభవించారు. ఇటీవలే ఈ కేసు నుంచి బయటపడటంతో బీజేపీలో చేరి మళ్ళీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలని కృష్ణాయాదవ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇతర పార్టీలలోని నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో సీనియర్‌ నేతలు, పార్టీ నాయకత్వాలపై అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే బిక్షమయ్యగౌడ్‌ను పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు కృష్ణాయాదవ్‌ను చేర్చుకోడానికి ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement