Friday, May 17, 2024

కోటలు దాటేలా బడ్జెట్ మాటలు, అసెంబ్లీ దాటని చేతలు.. ప్రసంగం లేకుండా చేసి గవర్నర్‌ను అవమానించారు: బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు ప్రశ్నించే అధికారం తమ పార్టీ శాసనసభ్యులకు ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు మాత్రం అసెంబ్లీ దాటవనే విషయం ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలను చూస్తుంటే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్డంగా జరగట్లేదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఈవిధంగా గవర్నర్‌ను అవమానపరచలేదని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడు, దివాలాకోరుతనమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేశారని, పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లో రాసిన సస్పెన్షన్ తీర్మానాన్ని బట్టి పథకం ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు.

ఈటల రాజేందర్‌ను శాసనసభలో చూడాల్సి వస్తుంది కాబట్టి తొలిరోజే సభ ప్రారంభమైన పది నిమిషాలకే సస్పెండ్ చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగం ఏడాది ముందే టీఆర్ఎస్ ప్రభుత్వ వీడ్కోలు ప్రసంగంలా ఉందని, నూతన రాష్ట్రంలో నూతనంగా ప్రగతి భవన్ మాత్రం నిర్మించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారని, కేంద్ర పథకాల నిధులను తమ నిధులుగా బడ్జెట్‌లో చూపించారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, ఎంఎంటీఎస్‌లో రాష్ట్ర వాటా ఇవ్వలేదంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగం అద్భుతంగా ఉందన్న కిషన్‌రెడ్డి… రాష్ట్ర అప్పుల చిట్టా కూడా విప్పితే బావుంటుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉద్దేశించి ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండా చేసిన టీఆర్‌ఎస్‌కు అంబేద్కర్ పేరెత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు. దళితబంధుకు కేటాయించిన నిధులతో వచ్చే పదిహేనేళ్లలోనైనా దళితులకు మేలు జరగదని, టీఆర్ఎస్ నాయకులకు మాత్రం మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement