Saturday, May 18, 2024

Delhi | నల్ల దుస్తుల్లో బీఆర్ఎస్ నిరసన.. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మణిపూర్ హింసాకాండ, అక్కడి గిరిజన మహిళలపై అకృత్యాలపై చర్చకు పట్టుబడుతున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించింది. ప్రతిపక్ష కూటమితో పాటు గురువారం పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బి. పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర రావు, లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్ కూడా నలుపు రంగు దుస్తుల్లో పార్లమెంట్‌కు హాజరయ్యారు.

ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై నిరసన తెలియజేయడంతో పాటు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరవధికంగా ఆందోళన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు సంఘీభావం తెలిపారు. అయితే నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ చేసిన కామెంట్లను బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు తప్పుబట్టారు. నలుపు రంగు దుస్తులు ధరించినవారి వర్తమానం, గతం, భవిష్యత్తు కూడా నలుపే (చీకటే) అంటూ ఆయన వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై చర్చించకుండా ఇంకా ఎన్ని రోజులు ఇలా కాలయాపన చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశ ప్రజలు గమనిస్తున్నారని, సమస్య పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement