Thursday, May 2, 2024

Big Story | కొత్త బస్సుల కొనుగోలుకు బ్రేక్‌.. అద్దె బస్సులకే ఆర్టీసీ మొగ్గు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ నష్టాల బాట నుంచి గట్టెక్కుతూనే నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూర్చిపెడుతున్న రూట్లలో నడిపేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలనీ టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం తొలుత భావించింది. కానీ, రూ.కోట్లు ఖర్చు చేసి సొంతంగా బస్సులను కొనడం కంటే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి అద్దె ప్రాతిపదికన బస్సులను తీసుకోవడం మేలని భావిస్తోంది. కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటే కేవలం పల్లె వెలుగు బస్సులకే రూ.70 లక్షల దాకా ఆర్టీసీ వెచ్చించాల్సి వస్తోంది.

ఇక సూపర్‌ లగ్జరీ ఆపై కేటగిరీ బస్సులకైతే రూ.కోటి వరకూ ఖర్చు చేయాల్సిందే. దీంతో ఇప్పటికే దాదాపు మూడు వేల అద్దె బస్సులను వినియోగిస్తున్న ఆర్టీసీ రానున్న రోజుల్లో అద్దె ప్రాతిపదికన మరిన్ని బస్సులను తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర్రవ్యాప్తంగా 9700 బస్సులను నడుపుతోంది. వీటిలో రాష్ట్ర్రవ్యాప్తంగా తిరిగే బస్సులతో పాటు ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాలకు సైతం బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు రద్దీ భారీగా ఉండే రూట్లలో ప్రైవేటు బస్‌ ఆపరేటర్ల నుంచి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆయా రూట్లలో టెండర్లను ఆహ్వానించి ఆర్టీసీ నిర్ణయించిన ధరకు బిడ్‌ వేసిన వారికి టెండర్లను అప్పగిస్తున్నది.

- Advertisement -

ఈ బస్సులకు డ్రైవర్లుగా ప్రైవేట్‌ వ్యక్తులే ఉంటారు. కాగా, కండక్టర్లుగా మాత్రం ఆర్టీసీ ఉద్యోగులే వ్యవహరిస్తారు. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న బస్సులలో ఎక్కువ శాతం హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో నడిపిస్తున్నారు. ఈ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించడం ద్వారా సంస్థకు ఆదాయం భారీగానే సమకూరుతున్నదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, టీఎస్‌ ఆర్టీసీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో త్వరలో ప్రవేశపెట్టనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులను సైతం అద్దె ప్రాతిపదికన నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని పలు రూట్లలో నడిపేందుకు ముందుగా కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ముందుగా 20 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ బస్సులను అందించేందుకు ముందుకొచ్చిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు కోట్‌ చేసింది.

అయితే, ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనే బదులు ఆ నిధులను సాధారణ బస్సుల నిర్వహణకు వినియోగించాలని ఆర్టీసీ అధికారులు తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అద్దె ప్రాతిపదికన డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకోవాలని భావిస్తూ ఆ బాధ్యతను అశోక్‌ లేలాండ్‌ కంపనీకి అప్పగించింది. ఆసక్తి ఉన్న సంస్థలను అద్దె పద్దతిలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు, ఇతర రాష్ట్రాలలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల నిర్వహణ ఏ విధంగా ఉంది అనే విషయాలపై సైతం టీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేసినట్లు సమాచారం.

ముంబైలో కూడా డబుల్‌ డెక్కర్‌ బస్సులకు టెండర్లు పిలవగా అక్కడ కూడా అశోక్‌ లేలాండ్‌ టెండరే ఖరారైందనీ, కానీ అక్కడ కూడా బస్సులు తీసుకునేందుకు తటపటాయిస్తూ అక్కడి ఆర్టీసీ అధికారులు టెండర్‌ను రద్దు చేసిందని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ముంబైలోనే వద్దనుకున్నాక తీవ్ర నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తాము వీటిని ఎలా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే ఈ ఏడాది ఆరంభంలో రాజధాని రోడ్లపై పరుగులు తీయాల్సిన డబుల్‌ డెక్కర్‌ బస్సులకు బ్రేక్‌ పడిందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement