Sunday, May 5, 2024

Delhi | టీటీడీపై బాబు, పవన్ దుష్ప్రచారం.. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తద్వారా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టి సమాజంలో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో పోరాడే బదులు చంద్రబాబు నాయుడు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని, వైఎస్సార్సీపీ నేతలు ట్రస్ట్ సొమ్ము లూటీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారని, కానీ తన విచారణ అదంతా పూర్తిగా అవాస్తవమని తేలిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

- Advertisement -

కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హిందువులకు చేసిందేమీ లేదని, సొంత మామకు గౌరవం ఇవ్వనివాడు హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అంటూ మొదట్లో ప్రచారం చేశారని, కానీ అదంతా అవాస్తవమని తేలిపోయిందని స్వామి అన్నారు.

హిందూ దేవాలయాల విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని, రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని హితవు పలికారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఆయన హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అక్కడ అలాంటిదేమీ జరగడం లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు జగన్‌ను ఢీకొట్టడం అంత సులువు కాదని వ్యాఖ్యానించారు. తాను టీటీడీ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్నానని, ఈ విషయంలో తనను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా తాను టీటీడీకి సహాయం చేస్తున్నానని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించేందుకు తాను త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement