Friday, December 6, 2024

Big Twist – రాములమ్మ ఉదారత.. కామాంధుడికి విముక్తి!

వాడో బద్మాష్​.. అచ్చం ఒసెయ్​ రాములమ్మ సినిమాలో విలన్​లా ఉంటుంది వాడి తీరు. కనిపించిన ఆడపిల్లను చెరబట్టందే వదిలిపెట్టడు. అట్లనే.. సేమ్​ టూ సేమ్​ ఇక్కడో ఘటన జరిగింది. ఓ బాలికపై కన్నేసిన ఆ కామాందు పెత్తందారి అఘాయిత్యానికి బాలిక గర్భం దాల్చింది. అయితే.. ఇక్కడితో కథ అయిపోలేదు. ఒకనొక టైమ్​లో బాలిక ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసింది. ఈ చిన్నారి రాములమ్మ కతేంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కానీ, ఆ పెదకాపు కుటుంబం వీరిని డబ్బుతో లొంగదీసుకోవాలని ట్రై చేసింది. దీనికి ఆ బాలిక ఫ్యామిలీ ఒప్పుకోలేదు. పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. దీంతో కోర్టు ఆ బద్మాష్​గాడికి జీవిత ఖైదు వేసింది.. అయిదేండ్ల తర్వాత మళ్లీ ఈ కథ చర్చకు వచ్చింది. ఆ బాలిక పెండ్లి చేసుకుని హ్యాపీగానే ఉందని హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకు వెళ్లాడు. బాలిక కూడా అవును.. అతడిని రిలీజ్​ చేయండి అని ధర్మాసనాన్ని కోరింది. అంతే.. కోర్టు ఫిదా అయ్యింది. వాడికి జైలు నుంచి విముక్తి లభించింది.

మానవత్వం.. దానవత్వం.. ఈ రెండూ రెండే. పరస్పరం విరుద్దం. కానీ, మనిషి మస్తిష్కాన్ని, ఆలోచనను తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిగా మార్చగలవు. ఈ రెండు గుణాలు ఏమార్చగలవు. వంద మంది దోషులు తప్పించుకోగాక, ఒక్క నిర్దోషిని శిక్షించటాన్ని ససేమిరా అంగీకరించని భారత న్యాయ వ్యవస్థలో.. ఎన్నో తీర్పులు.. ఊహించని వాదనలు. తీర్పులనే దండించే తీర్పులెన్నో.. ఎన్నెన్నో. అతడో కిరాతకుడు. కాదు మృగాడు. ఓ బాలికను అత్యంత పాశవికంగా చెరపట్టాడు. సభ్య సమాజం తల్లడిల్లిపోయింది. మహిళాలోకం ఆగ్రహోగ్రంతో రగిలిపోయింది. దోషికి ఉరే సరి అని నినదించింది. ధర్మాసనం నిజాన్ని గుర్తించింది. దోషిని జీవిత ఖైదుగా నిర్ధారించింది. ఇక్కడే మరో మలుపు.. దానవుడిలో మానవుడిని వెతికే సర్వోన్నత న్యాయస్థానం.. బాధితురాలి క్షమాభిక్షను దోషికి ప్రసాదించింది. ఆ దోషి కారాగార జీవితాన్ని సడలించి అసలు సిసలు మానవీయాలోచనకు పెద్ద పీట వేసిన వైనం ఇది.

ట్విస్టులే ట్విస్టులు!
అది 1996. మధ్య ప్రదేశ్​లోని ఓ మారు మూల పల్లె. అక్కడో పెత్తందారి అపర కీచకుడిగా మారాడు. కళ్లెదుట కనిపించిన ఓ బాలికపై అతడి కన్ను పడింది. అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అత్యాచారం చేశారు. బాధితురాలు గర్భం ధరించింది. కుటుంబ సభ్యులు ఈ రాములమ్మ కతేంటని ఆరా తీశారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం ఆ పెత్తందారిడిని అరెస్టు చేశారు. బాధితురాలి గర్భ్రశ్రావం కోసం.. శిక్షకు ముందే దోషి, దోషి సతీమణి రూ.10వేల బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ, బాధితురాలు తలొగ్గలేదు. ఎక్కడా తగ్గలేదు. కోర్టులో న్యాయం గెలిచింది. ఆ బద్మాష్​ కీచకుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. ప్రస్తుతం ఐదేళ్లుగా ఈ దోషి కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడే మరో ట్విస్ట్​తో కొత్త స్క్రీన్​ ప్లే తెరమీదకు వచ్చింది.

భళా.. బలే తీర్పు…
ఇక.. బాధితురాలు పెళ్లి చేసుకుంది. సంతోషంగా కాపురం చేస్తోంది. తానే జైలులో మగ్గిపోతున్నానని మధ్యప్రదేశ్ హైకోర్టును దోషి ఆశ్రయించాడు. కోర్టులో సాక్ష్యాధారాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషికి విముక్తి ఎలా ఇస్తాం.. అని హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. దోషి ఈ సారి సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. బాధితురాలినీ తన ముఖ్య అతిథిగా కోర్టు బోనులో ప్రవేశపెట్టాడు. తనకు వివాహమైందని, పెళ్లి చేసుకున్నా, చాలా సంతోషంగా ఉన్నా.. అతడిని వదిలేయండి అని బాధితురాలు వేడుకొంది. ఈ విచారణలోత్రిసభ్య ధర్మాసనం ఓ నిర్ధారణకు వచ్చింది. దోషికి ఈ శిక్ష చాలు. ఇక కొనసాగించ రాదు. అతడి నేరానికి ఏడేళ్ల శిక్ష సరిపోతుంది… అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, అరవింద కుమార్​తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అదే విధంగా నిందితుడు, నిందితుడి భార్య బాధితురాలికి సంరక్షకులుగా వ్యవహరించాలి. పేదరికం నుంచి ఆమెను కాపాడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement