Monday, April 29, 2024

Big story : అధికారమే పరమావధి, ఆందోళనలు, ఉద్యమాలే పునాది.. మారుతున్నఉద్యమ నేతల తీరు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రజా ఉద్యమాలు, ఆందోళనల లక్ష్యాలు ఏవైనా, ఉద్యమ నేతలు మాత్రం అధికారమే పరమావధిగా రాజకీయాల్లో వ్యక్తిగత పరపతి పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం దేశంలో కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య ఉద్యమ నేతలు తాము చేపట్టిన ఉద్యమానికి ప్రజల్లో లభించిన ఆదరణ, మద్ధతు చూసి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ వ్యవహారమే తాజా ఉదాహరణ. రైతు సమస్యలపై పోరాడాల్సిన రైతు సంఘం నేతలు, రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సమస్యలు, రైతు ప్రయోజనాలను విస్మరించి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారంటూ బీకేయూ (టికాయత్) అధ్యక్ష పదవి నుంచి నరేష్ టికాయత్‌ను తొలగించడంతో ఈ సంఘంలో చీలక మొదలైంది. ఆ తర్వాత బీకేయూ అధికార ప్రతినిధిగా మీడియాలో, రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో కనిపించే రాకేశ్ టికాయత్‌ను సైతం ఆ సంఘం నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా, అసలు రాజకీయాలతోనే సంబంధం లేకుండా కేవలం రైతుల కోసం మాత్రమే భారతీయ కిసాన్ యూనియన్ పనిచేస్తుందంటూ చీలికవర్గం నేత రాజేశ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

చీలిక కొత్తేమీ కాదు..

ఉత్తరాదిన ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బలమైన రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్‌లో చీలికలు కొత్తేమీ కాదు. రైతు సంఘం నేతల మధ్య విబేధాలతో గతంలోనూ ఈ సంఘం చీలింది. గత ఏడాది దేశ రాజధాని నగరాన్ని చుట్టుముట్టి రైతులు సాగించిన పోరాటంలో బీకేయూ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో గాజీపూర్ బోర్డర్ వద్ద భారీ సంఖ్యలో రైతులు నెలల తరబడి సాగించిన పోరాటాన్ని టికాయత్ సోదరులు ముందుండి నడిపించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రీయ లోక్‌దళ్ – సమాజ్‌వాదీ కూటమికి బీకేయూ మద్ధతు తెలిపింది. అయితే ఆ కూటమి విజయం సాధించకపోగా, బీకేయూ ప్రభావం ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో సైతం బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై పోరాడాల్సిన రైతు సంఘం రాజకీయాల్లోకి దూరడం చాలామంది రైతులకు ససేమిరా ఇష్టం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావుతోనూ రాకేశ్ టికాయత్ పలుమార్లు భేటీలు జరిపారు. ఢిల్లీలో కేసీఆర్ చేపట్టిన రైతు ధర్నాకు సైతం సంఘీభావం తెలుపుతూ వేదిక పంచుకున్నారు. మొత్తంగా బీకేయూ వ్యవహార శైలి బీజేపీని సైతం ఇబ్బందిపెడుతూ వచ్చింది.

స్వభావం, స్వరూపం మార్చుకున్న రైతు సంఘం..

రైతు సమస్యలపై పోరాడేందుకు 1987లో భారతీయ కిసాన్ యూనియన్ ఏర్పాటైంది. టికాయత్ సోదరుల తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ ఈ రైతు సంఘాన్ని స్థాపించారు. కేవలం రైతు ఉద్యమాల్లోనే కాదు, జాట్ సామాజికవర్గంలోనూ టికాయత్ కుటుంబం ఎంతో ప్రభావాన్ని చూపుతూ వచ్చింది. అయితే మహేంద్ర సింగ్ టికాయత్ మొదటి నుంచి రైతు సంఘాన్ని రాజకీయాలకు దూరంగానే ఉంచుతూ వచ్చారు. కానీ ఆయన మరణం తర్వాత నాయకత్వ బాధ్యతల్ని ఆయన కొడుకులిద్దరూ చేపట్టారు. అప్పటి నుంచి బీకేయూ తన స్వభావాన్ని క్రమక్రమంగా మార్చుకుంటూ వచ్చింది. టికాయత్ సోదరులు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అన్ని వేదికలనూ ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. చివరకు రైతు సంఘాన్ని చీలిక వరకు తీసుకొచ్చారు. పశ్చిమ యూపీలోని రైతులు భారీ సంఖ్యలో చీలిక వర్గం వెంట నడవడం ఇప్పుడు టికాయత్ సోదరుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది. ఇన్నాళ్లుగా రైతుల్లో, జాట్ సామాజికవర్గంలో టికాయత్ కుటుంబం సాగించిన పట్టు సైతం క్రమంగా సడలిపోతుందని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అయితే ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనేనంటూ రాకేశ్ టికాయత్ ఆరోపిస్తున్నారు. వీటి సంగతెలా ఉన్నా.. రైతు సంఘం రైతు సమస్యల వరకే పరిమితమైతే ఈ పరిస్థితి వచ్చేది కాదని, రాజకీయాల్లో దూరి కొన్ని పక్షాలకు మద్ధతిస్తే సహజంగానే ప్రత్యర్థి రాజకీయ ఎత్తుగడలు అమలు చేసి బలహీనపర్చే ప్రయత్నాలు సాగిస్తారని రైతుల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement