Wednesday, May 15, 2024

Big Story : భూ రికార్డులు ఆన్ లైన్.. డిజిటలైజేషన్ చేస్తున్న రెవెన్యూశాఖ..

వ్యవసాయ భూమి సమస్తం జియో రిఫరెన్స్‌ జోడింపు దిశగా సర్వే సెటిల్‌మెంట్‌ శాఖ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో భూముల చిరునామా ఆన్‌లైన్‌లో స్పష్టంగా ప్రత్యక్షం కానుంది. తద్వారా భూ రికార్డుల నిర్వహణ మరింత ఆధునికంగా, సరళంగా ఆన్‌లైన్‌కానుంది. ఇందుకు అనుగుణంగా సాంకేతికతతో గ్రామ పటాలు, టిప్పన్‌లు రూపొందుతున్నాయి. ఈ కార్యాచరణ విజయవంతమైతే రెవెన్యూ వ్యవహారాల్లో దేశంలో ఎక్కడాలేని స్పష్టత తెలంగాణలో అందు బాటులోకి రానుంది. ఇప్పటికే ధరణితో వచ్చిన పారదర్శక భూ నిర్వహణ మరింత ఆధునికతతో ప్రజల ముంగిటకు రానున్నది. భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత ప్రతి భూకమతానికి జియో రిఫరెన్స్‌ ఇచ్చేందుకు సర్వే శాఖ కృషి చేస్తున్నది. ఈ కార్యక్రమంద్వారా టిప్ప న్‌లను డిజిటలైజ్‌ చేసి వాడుక భాషలో వెలుగులోకి తీసుకొచ్చేందుకు సాంకేతికతను జోడిస్తున్నారు. నిజాం కాలంనుంచి మరాఠా, ఉర్దూ భాషల్లో ఉన్న టిప్పన్‌లను తెలుగులోకి అనువది స్తున్నారు. ఇందుకు గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌)ను వినియోగించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో భూములకు గ్రాఫికల్‌ రికార్డులు డిజిటలైజ్‌ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్దమైంది. గ్రామ పటం, టిప్పన్‌లను డిజిటలైజ్‌ చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. సీఎంఆర్‌ఓ ప్రాజెక్టు కింద 10829 గ్రామాలకుగానూ 10,559 గ్రామాల మ్యాపుల డిజిటలీకరణ పూర్తి చేశారు.

ఆ తర్వాత ప్రతి భూ కమతానికి లెక్క చెప్పేలా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి సర్వే నెంబర్‌లోని భూమిని నేరుగా గూగుల్‌ ఎర్త్‌లో చూసుకునేలా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో సేత్వారీ, డిజిటలైజ్డ్‌ విలేజ్‌ మ్యాపులను సర్వే సెటిల్‌మెంట్‌, భూమి రికార్డుల శాఖ సిద్దం చేస్తోంది. దీంతో భూ అక్రమాల కట్టడి సాకారమవుతోందని సర్వే సెటిల్‌మెంట్‌ శాఖ చెబుతోంది. తొలుత భూ సమగ్ర సర్వే చేపట్టాలని యోచించిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌గా పలు మండలాల్లో జరపాలనే యోచన కార్యరూపంలోకి రాలేదు. టెండర్ల వరకు వచ్చిన ప్రతిపాదనలు మధ్యలోనే నిల్చిపోయాయి. ఈ నేపథ్యంలో ఆక్రమాలకు తావులేకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమితో సేత్వారీ అప్‌డేట్‌ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004నుంచి 2009 మధ్య కాలంలో సేత్వారీ రికార్డులను కొంతమేరకు స్కానింగ్‌ చేసి అప్‌డేట్‌ చేశారు. ఆ తర్వాత సదరు కార్యాచరణను ఆపివేసిన అధికారులు వాటిని డిటిటలైజ్‌ చేయడాన్ని పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు మేల్కొన్న తెలంగాణ భూమి రికార్డుల శాఖ రాష్ట్రం మొత్తం యూనిట్‌గా ప్రత్యేక నెంబర్ల వారీగా సేత్వారీ అప్‌డేట్‌ చేస్తోంది. తద్వారా 10829 గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఒక్కో గ్రామపు భూములన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. వీటిని కాస్రా పహాణీలో అప్‌డేట్‌ చేసిన తర్వాతే ఏది ప్రభుత్వ భూమో, ఏది పట్టా భూమో క్షణాల్లో తెలిసిపోనుంది.

విలేజ్‌ మ్యాప్‌ల డిజిటలైజేషన్‌ను కూడా ఇదే సందర్భంగా ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ శాఖ వేగవంతం చేస్తోంది. 10800 గ్రామాల్లో పనులను ఆరంభించింది. గతంలో డేటాబేస్‌లో తెలుగు, ఉర్దూ, మరాఠా, ఇంగ్లీష్‌లో ఉన్న రికార్డులను తెలుగు, ఇంగ్లీష్‌లలో రూపొందించాలని, ఇందుకు అనువుగా డిజిటలైజేషన్‌తో మరింత సులువు చేయాలన్న ప్రయత్నాలను వేగవంతం చేశారు. తద్వారా మ్యాపులను కొత్తగా గీస్తున్నారు. ఇందుకు తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ సహయంతో డేటా వెక్టోరైస్‌ చేసి జియో రిఫరెన్స్‌ను వర్తింపజేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమి సర్వే నెంబర్‌, గ్రామం పేరు కొట్టగానే క్షణాల్లో వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ కసరత్తులో భాగంగా వేలాది మ్యాపులను అప్‌లోడ్‌ చేశారు. మ్యాపులను వెబ్‌ల్యాండ్‌లో అప్‌లోడ్‌ చేయడంద్వారా సర్వే నెంబర్ల ద్వారా లొకేషన్‌ను చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ సహకారిత భూ నక్ష ద్వారా ఆన్‌లైన్‌లో మ్యాప్‌పై క్లిక్‌ చేస్తే సర్వే నెంబర్‌తో ఉన్న భూమి, శాటిలైట్‌ ఇమేజీతో ప్రత్యక్షమవుతుంది. ఆయా భూమి హద్దులతో సహా కనిపించనుంది. దీంతో భూ రికార్డులు ఎలా ఉన్నాయి… ఎవరి పేరు మీద ఉన్నాయి….హద్దుల స్థితిగతులు… వంటివన్నీ ప్రాంతంతో సహా కనిపిస్తాయి. భూమి యజమాని పేరు, ఫోటో, ఆయా సర్వే నెంబర్‌లో ఉన్న మొత్తం భూముల బిట్లు, విస్తీర్ణం, పట్టాదార్ల వివరాలు, పొజిషన్‌ వంటివన్ని వెలుగులోకి వస్తాయి. దీంతో భూ సమస్యలు అనేకం ప్రాథమిక స్థాయిలోనే నివారించేందుకు వీలు కల్గుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement