Monday, April 29, 2024

Big Story : ఇటు పార‌ద‌ర్శ‌కం.. అటు వ్యూహాత్మ‌కం.. ఐఏఎస్ బ‌దిలీల‌పై ఫోక‌స్..

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న పూర్తయిన వెంటనే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదలీలు ఉండొచ్చనే ప్రచారం తాజాగా ఊపందుకుంది. ఇందులో కొన్ని జిల్లాల్లో లాంగ్‌ స్టాండింగ్‌లో ఉన్న కలెక్టర్లు సహా, కీలక శాఖల అధిపతులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. పలు కీలక శాఖలకు ఇప్పటికే కొందరు అధికారులు ఇన్‌చార్జీలుగా ఉండటంతో పాలనలో జాప్యం ఎదురవు తోందన్న విమర్శలు తరచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జీల పాలనలో ఉన్న శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారుల నియామకం ఉండే అవకాశం ఉందని తెలిసింది. పాలనకు కీలకం అఖిల భారత స్థాయి అధికారులే కావడంతో వీరిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవిధంగా ప్రభుత్వ పాలనకు వీరే వెన్నెముకగా నిలుస్తారు. జీవోల రూపకల్పన, విధివిధానాల ఖరారు.

ప్రభుత్వ పెద్దలకు అంతర్గత సలహాలు, కిందిస్థాయిలో పథకాల అమలు, పర్యవేక్షణ, పథకాల గ్రౌండింగ్‌ వంటి వాటికి వీరు కీలకంగా ఉండాల్సిందే. నిధుల వ్యయాలు, కేటాయింపులు, వాటి పారదర్శకత, ఏటా బడ్జెట్‌ ప్రతిపాదనలు, తమ శాఖలకు నిధుల వంటి వాటిలో ఐఏఎస్‌లు అత్యంత అవశ్యం. మంత్రులకు కూడా అనేక సందర్భాల్లో ఐఏఎస్‌లే కీలక సలహాలు, సూచనలు చేసి పాలనలో, ప్రభుత్వ పథకాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. రాష్ట్రానికి 208 ఐఏఎస్‌ పోస్టులు మంజూరుకాగా ఇందులో 136 మంది ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్ర పాలనకు కీలకమైన అధికారుల కొరత తెలంగాణను వేధిస్తోంది. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ(డీవోపీటీ)కి తెలంగాణ సర్కార్‌ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఏటా తూతూమంత్రంగా ఎక్కువలో ఎక్కువగా 10మందిలోపే కేటాయిస్తోంది.

ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఒక్కో అధికారికి రెండు మూడు శాఖల బాధ్యతలను అప్పగించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పోస్టుల సంఖ్య 10నుంచి 33కి పెరిగింది. అయితే 2018లో ఎన్నికల సందర్భంగా ఒకేసారి 50కి పైగా ఐఏఎస్‌లను బదలీ చేసిన ప్రభుత్వం, గత ఆగస్టులో 14మందిని బదలీలు చేసింది. అయితే ఈ మూడేళ్లలో పెద్దగా బదలీలపై దృష్టి పెట్టలేదు.

రాష్ట్రంలో కీలకమైన ప్రభుత్వ పెద్దగా ఉన్న సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుతోపాటు రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మైనింగ్‌ శాఖకు కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా సచివాలయ అధికారుల పదోన్నతులకు చెందిన డీపీసీ, ల్యాండ్‌ పూలింగ్‌ కమిటీ, తాజాగా పోస్టుల విభజన వంటి కమిటీల్లో ఆయన కీలకంగా ఉన్నారు. సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులకు కూడా అదనపు బాధ్యతలున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న అర్వింద్‌కుమార్‌కు సమాచార, పౌరసంబంధాల శాఖ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ పోస్టులు అదనంగా ఉన్నాయి. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు పరిశ్రమల శాఖ అదనంగా ఉంది. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీం కార్మిక శాఖ కమిషనర్‌గా ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీఎంవో కార్యదర్శిగా ఉన్న శేషాద్రి నాయుడు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా, సీఎంవో కార్యదర్శిగా ఉన్న రాహూల్‌ బొజ్జా ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

సీనియర్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా, విద్యా శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు అదనంగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బాధ్యతలను, నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ను హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జీగా కొనసాగిస్తున్నారు. వాసం వెంకటేశ్వర్లు, అబ్దుల్‌ అజీమ్‌లు వెయిటింగ్‌లో ఉన్నారు.

- Advertisement -

కొన్ని జిల్లాల్లో కలెక్టర్లతోపాటు కీలక శాఖలను నిర్వహిస్తూ వస్తున్న జయేష్‌ రంజన్‌, అర్వింద్‌కుమార్‌, రామకృష్ణారావు, వికాస్‌రాజ్‌లకు కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఈ దఫా రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌తోపాటు, సీసీఎల్‌ఏను బలోపేతం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బదలీలపై సీఎం కేసీఆర్‌తో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ చర్చించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈనెల 14న ఎన్నికల కోడ్‌ ముగుస్తున్న తర్వాత సీఎం కేసీఆర్‌ బదలీలపై ఆమోదముద్ర వేయనున్నారని, ఈ బదలీలు ఎన్నికల దృష్టితో ఆలోచించి చేస్తున్నారని ఐఏఎస్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement