Thursday, May 9, 2024

Delhi | తెలంగాణలో 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు ఓబీసీలు దూరం : పొన్నాల లక్ష్మయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో 1983 నుంచి కాంగ్రెస్ పార్టీ సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోతోందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. గత 40 ఏళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ సగం స్థానాలను దాటి గెలవలేకపోవడానికి కారణం వెనుకబడిన వర్గాలు (బీసీలు) పార్టీకి దూరమవడమేనని ఆయన సూత్రీకరించారు. ఈ నలభై ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 3 పర్యాయాలు అధికారం చేపట్టిందని, ఆ సమయంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కాంగ్రెస్ గెలుపొందిన సీట్లు సగం కూడా లేవని చెప్పారు.

- Advertisement -

ఈ పరిస్థితికి కారణమేంటో తెలుసుకోడానికి లోతుగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని అన్నారు. బీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు అని తాను చెప్పడం లేదని, ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో బీసీలకు సీట్లు ఇచ్చాం అన్నట్టుగా వ్యవహరిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. పార్టీలో నిరంతరం బీసీలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జనగామ జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానానికి ఆయన ఇచ్చిన లేఖపై ప్రశ్నించగా.. తాను పార్టీ బాగు కోసం, అభివృద్ధి కోసం చెప్పాల్సింది చెప్పానని, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తాను ఊహించలేననని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014లో పొన్నాల అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్నికలకు 40 రోజుల ముందు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, పైగా తాను కోరుకుంటే ఇచ్చిన బాధ్యత కాదని అన్నారు.

2014 ఎన్నికల ప్రచారంలో నాటి టీఆర్ఎస్ అధ్యక్షులు కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) తెలివిగా “తెలంగాణ తెచ్చింది ఎవరు – ఇచ్చింది ఎవరు” అన్న ప్రశ్న, ప్రస్తావన లేకుండా వ్యవహరించారని అన్నారు. తెలంగాణ తాను తెచ్చాను కాబట్టి తనకు ఓటేయండి అంటే.. ఇచ్చింది కాంగ్రెస్ కదా అనే ఆలోచన ప్రజల మనసులో మెదిలేదని, కానీ దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, మూడు ఎకరాల భూమి వంటి హామీలతో జనాన్ని నమ్మించి గెలుపొందగలిగారని సూత్రీకరించారు. ప్రజల్ని మభ్యపెట్టే హామీలతోనే ప్రతిసారీ గెలుపొందుతున్నారని పొన్నాల అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement