Tuesday, April 30, 2024

కృష్ణయ్య నేతృత్వంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన బీసీ సంఘాలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత ప్రధానిగా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ దేశంలో బీసీలకు అన్యాయం కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి పలు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆర్. కృష్ణయ్య బీసీ డిమాండ్ల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. బీసీల డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమం వస్తుందని రాష్ట్రపతికి చెప్పానన్నారు. విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభా నిష్పత్తి ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, దేశంలో బీసీల జనాభా 56% ఉన్నందున ఆ మేరకు రిజర్వేషన్లు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని అన్నారు. అగ్ర కులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినపుడు, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. క్రిమిలేయర్ విధానం కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.

అదానీ, అంబానీలకు రుణాలు ఇస్తున్నారని, కానీ పేదలకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతితో సమావేశం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతి ప్రశంసించాని ఆర్. కృష్ణయ్య చెప్పారు. వెనుకబడిన విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించాలని రాష్ట్రపతి సూచించారని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానంటూ రాష్ట్రపతి హామీ ఇచ్చారని కృష్ణయ్య చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన బీసీ నేతల బృందంలో ఆర్. కృష్ణయ్యతో పాటు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, భూపేష్ సాగర్, రాము, నీల వెంకటేష్, జర్రి పోతుల పరశురాం ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement