Sunday, May 5, 2024

కేసీఆర్ స్పందించి ఉంటే జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగేవారు కాదు: బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సరైన సమయంలో కేసీఆర్ స్పందించి ఉన్నట్టైతే… జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగేవారు కాదన్నారు. జూడాలను పిలిచి చర్చించే ధైర్యం కూడా కేసీఆర్‌కు లేదా? అని ఎద్దేవా చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా పంజా విసురుతున్న వేళ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని… అయినా ఖాళీలను కేసీఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.

కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందిలో ఎంతమందికి నష్టపరిహారం చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా జూనియర్ డాక్టర్లు విధులు నిర్వహిస్తే వారి తరపున బీజేపీ పోరాడుతుందన్నారు. ఆసుపత్రులను సందర్శించిన కేసీఆర్… ఏయే సమస్యలను గుర్తించారో మాత్రం చెప్పలేదని విమర్శించారు. సీఎం వస్తున్నారంటూ ఆసుపత్రుల్లో సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాట్లు చేశారని… అక్కడకు వెళ్లి కేసీఆర్ నటిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయంటూ తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement