Sunday, May 5, 2024

బాబోయ్​ చికెన్, కొండెక్కిన కోడి ధర.. ఏకంగా 300 దాటేసిన కిలో రేట్..​

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజు 6లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతాయి. దేశంలోనే అత్యధిక చికెన్‌ అమ్మకాలు జరిగే నగరంగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది. ఢిల్లిలో 5.5 లక్షల కిలోలు, బెంగళూర్‌లో 5లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలతో తర్వాతి రెండు, మూడవస్థానాలను ఈ నగరాలు ఆక్రమించాయి. పౌల్ట్రి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం హైదరాబాద్‌ నగరంలో ఒక వ్యక్తి సగటున ఏడాదికి 31 కిలోల చికెన్‌ తింటుండగా ఇండియా సగటు మాత్రం కేవలం 5 కిలోలు మాత్రమే. ఒక్కసారి ఈ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్‌ నగర వాసులు చికెన్‌ను ఎంత ఇష్టంగా తింటారో అర్థమవుతుంది. అయితే చికెన్‌ ధరలకు రెక్కలు రావడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. వేసవి కాలంలో చికెన్‌ ధరలు పెరగడం సర్వసాధారణం. కాని గడిచిన రెండు వారాలుగా మునుపెన్నడూ లేనంతగా చికెన్‌ ధర రికార్డు స్థాయికి పెరిగింది. నగరంలోని అన్ని మార్కెట్లలో రూ.300 దాటడంతో చికెన్‌ ప్రియులకు మింగుడు పడటం లేదు. సిద్దిపేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కోళ్ల సరఫరా తగ్గడంతో పాటు వినియోగం పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు అంటున్నారు.

రూ.500 దాటిన నాటు కోడి చికెన్‌..

నాటుకోడి చికెన్‌ ధర మటన్‌తో పోటీ పడుతోంది. నాటు కోళ్ల లభ్యత నానాటికి తగ్గుతుండంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అదిలాబాద్‌, ఖమ్మం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నాటుకోళ్లను తెచ్చి అమ్ముతుంటారు. వీటితో పాటు మద్యప్రదేశ్‌ నుంచి కడక్‌నాథ్‌ కోళ్లను తెచ్చి ఇక్కడి ఫారాల్లో పెంచుతున్నారు. ఎండల వల్ల నాటు కోళ్ల సరఫరా తగ్గడంతో హైదరాబాద్‌ మార్కెట్లో నాటుకోళ్ల ధరలకు రెక్క లొచ్చాయని వ్యాపారులు అంటున్నారు. దీనికి తోడు చాలామంది మాంసం ప్రియులు నాటుకోళ్లను ఇష్ట ంగా తింటారు. దాంతో డిమాండ్‌కు అనుగుణంగా అమాంతం రేట్లను పెంచుతున్నారు.

పెరిగిన నిర్వహణ వ్యయం..

పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం కూడా భారీగా పెరిగింది. మొక్క జొన్న కిలో రూ.20 నుంచి 30కి చేరుకోగా, సోయా రూ.50 నుంచి సెంచరికి చేరువైంది. తవుడు ధర సైతం రెట్టింపయింది. దానికి తోడు కోడి పిల్ల ధర రూ.30 నుంచి 40కి చేరుకోవడంతో పౌల్ట్రి రైతులకు ఇప్పుడున్న ధరలు కూడా గిట్టుబాటు కావడం లేదని తెలుస్తోంది. కోడి కిలోన్నర కావడానికి గరిష్ట ంగా 40 రోజులు పడుతుంది. ఈ సం వత్సరం మార్చి నుంచి ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్ల దశ నుంచి కోడి దశకు ఎదగడానికి 60రోజులు పడుతుందని, ఖర్చులు విపరీతంగా పెరగుతున్నాయని పౌల్ట్రిd వర్గాలు చెబుతున్నారు. దానికి తోడు నీటి వసతులు లేక చాలాచోట్ల కోళ్ల పెంపకాన్ని రైతులు తగ్గించడం కూడా ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement