Thursday, May 2, 2024

స్మార్ట్‌ కార్డులకు మంగళం.. తైవాన్‌, చైనా నుంచి నిలిచిపోయిన చిప్స్‌ దిగుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ తదితర ధృవపత్రాలకు సంబంధించిన సమాచారంతో జారీ చేస్తున్న స్మార్ట్‌ కార్డులను నిలిపివేసింది. వాహనదారులకు సంబంధించిన పూర్తి వివరాలతో రూపొందించే చిప్స్‌ లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి అందజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తైవాన్‌, చైనా దేశాల నుంచి చిప్స్‌ దిగుమతి నిలచిపోయింది. అప్పటి నుంచి రవాణా శాఖ అధికారులు చిప్స్‌ లేకుండానే కార్డులను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం చిప్స్‌ కొరత తీరి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ వాటిని తిరిగి వినియోగంలోకి తేకుండానే… చిప్‌ లేకుండానే కార్డులు వాహనదారులకు అందజేస్తున్నారు. అక్రమంగా నకిలీ కార్డుల తయారీకి చెక్‌ పెట్టేందుకు 2009లో స్మార్ట్‌ కార్డుల్లో చిప్స్‌ను ప్రవేశపెట్టారు.

ఈ కార్డులలో వాహనదారుల పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు స్మార్ట్‌ కార్డుల జారీతో ఎలాంటి నకిలీ పత్రాలకు తావు లేకుండా ఆర్టీఏ సేవలు మరింత నాణ్యంగా అందించడానికి వీలు కలిగింది. వాహనదారునికి పూర్తి భద్రత కూడా లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రవాణా శాఖలో వినియోగదారులకు పూర్తి భద్రతతో కూడిన మంజూరు చేసేది. వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఇతరత్రా సంఘటనలలో ఈ స్మార్ట్‌ కార్డులులలోని చిప్స్‌ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు కలిగేది. కాగా, తాజాగా వాహనదారుల రిజిస్ట్రేషన్‌, లైసెన్సులకు చిప్స్‌ జారీ తీసివేయడంతో గతంలో మాదిరిగా అక్రమాలకు రవాణా శాఖ అవకాశం ఇస్తున్నదనే విమర్శలు తలెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement