Thursday, May 16, 2024

త్వరలో గురుకుల బోర్డు నుంచి మరో నోటిఫికేషన్‌.. వారం పది రోజుల్లో వెలువడే ఛాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గురుకుల బోర్డు నుంచి త్వరలో మరో నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంనాటికి 1300 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు గురుకుల బోర్డు తీవ్ర కసరత్తు చేస్తోంది. మొత్తం 10,675 పోస్టులను గురుకుల బోర్డు భర్తీ చేయాల్సి ఉంది. అయితే అందులో తొలివిడతగా 9231 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను సైతం చేపట్టింది.

రాష్ట్రంలోని అన్ని గురుకులాలకు 11,687 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. ఇందులో టీచింగ్‌ పోస్టులు 10,675 ఉంటే, మిగిలినవి 1012 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి. టీచింగ్‌ పోస్టులను గురుకుల బోర్డు ద్వారా చేపట్టాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. నాన్‌ టీచింగ్‌ పోస్టులైన స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలను మాత్రం మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా, మిగితావి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ బాధ్యతను అప్పగించింది. టీచింగ్‌ పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

గురుకుల బోర్డు జారీ చేసిన 9231 పోస్టుల భర్తీని పకడ్బందీగా చేపట్టేందుకు గురుకుల బోర్డు ఈమేరకు చర్యలు తీసుకుంటుంది. న్యాయపరమైన చిక్కులు ఉన్న 1444 పోస్టులను రెండో విడతలో చేపట్టాలని గురుకుల బోర్డు నిర్ణయించింది. అయితే గురుకుల విద్యాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, అగ్రికల్చర్‌, డాటా సైన్స్‌ తదితర కోర్సుల పోస్టులకు సంబంధించి నియామకాలకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకు నిపుణల సలహాలను బోర్డు అధికారులు తీసుకుంటున్నట్లు తెలిసింది.

సర్వీస్‌ రూల్స్‌ ప్రక్రియను ముగించుకొని ఈనెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో 1300 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు గురుకుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గురుకుల బోర్డు నుంచి వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని గురుకుల ఉద్యోగ నియామక భర్తీ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement