Sunday, April 28, 2024

కొత్త డీజీపీగా అంజనీ కుమార్‌.. శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్‌, మహేశ్‌ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం తెలంగాణ స్టేట్‌ పోలీసు అకాడమీలో మహేందర్‌ రెడ్డి నుంచి డీజీపీ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్‌ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో ఆయన ముందువరుసలో ఉన్నారు. 2026 జనవరి వరకు డీజీపీ పదవిలో అంజనీ కుమార్‌ కొనసాగనున్నారు.

కాగా.. 1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్‌ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి రెండు మెడళ్లు పొందారు. 2003 వరకు సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, అనంతరం రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీగా, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీగా, గ్రేహౌండ్స్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్‌ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.

1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్‌.. పాట్నా సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను, ఢిల్లి విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఐపీఎస్‌ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్రపతి పోలీసు మెడల్‌ అందుకున్నారు.

- Advertisement -

మహేందర్‌రెడ్డికి ఘనంగా వీడ్కోలు…

పదవీ విరమణ చేసిన రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డికి తెలంగాణ పోలీసు అకాడమీలో ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మహేందర్‌రెడ్డి అత్యధిక కాలంపాటు డీజీపీగా సేవలందించారు. ఐపీఎస్‌గా 36ఏళ్లపాటు పనిచేశారు. పోలీసు శాఖలో సాంకేతికతతో కూడిన విప్లవాత్మక మార్పులను మహేందర్‌రెడ్డి తీసుకొచ్చారు.

రాచకొండ సీపీగా దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ…

రాచకొండ నూతన పోలీసు కమిషనర్‌గా దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సీపీగా ఉన్న మహేష్‌ భగవత్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్‌ ఏర్పడిన నాటి నుంచి మహేష్‌ భగవత్‌ రాచకొండ సీపీగా సేవలందించారు. మహేష్‌ భగవత్‌ను ప్రభుత్వం తెలంగాణ సీఐడీ డీజీగా బదిలీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement