Thursday, March 28, 2024

Big story | తగ్గుతున్న వరి, పెరుగుతున్న ఉద్యానసాగు.. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల ఫోకస్​

అమరావతి, ఆంధ్రప్రభ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు లాభదాయక పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు వరి విస్తీర్ణం తగ్గుముఖం పడుతుండగా, ఉద్యాన పంటల విస్తీర్ణంలో పెరుగుదల నమోదు కావటమే దీనికి నిదర్శనం. ఖరీప్‌ -2022లో వరిసాగు విస్తీర్ణం 4.77 లక్షల ఎకరాల్లో తగ్గిపోయింది. 40.75 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ లక్ష్యంగా ప్రకటిస్తే అధికారిక లెక్కల ప్రకారం కేవలం 35.97 లక్షల ఎకరాల్లోనే సాగయింది. రబీలో 20.78 లక్షల వరి విస్తీర్ణాన్ని లక్ష్యగా ప్రకటిస్తే, 10 నుంచి 15 శాతం విస్తీర్ణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వం కూడా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహకాలు అందిస్తోంది.

అపరాలు, నూనెగింజలతో పాటు ప్రత్యేకించి ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంపుదల చేసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. గడిచిన మూడేళ్ళలో 4.29 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగు కావటం విశేషం. ఈ ఏడాది 2022-23 ఖరీఫ్‌, రబీ సీజన్లలో కలిపి అదనంగా మరో 1.34 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. బోర్ల కింద వరి సాగు చేయవద్దని కోరుతోంది..ప్రత్యామ్నాయంగా ఉద్యానపంటలను సూచిస్తోంది. వరి సాగు అధికంగా ఉండే కృష్ణా-గోదావరి ప్రాంతాల్లో బోర్ల కింద వరికు బదులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తే లాభదాయంగా ఉంటుందని ఉద్యానశాఖలోని శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు.

ఆయిల్‌ పామ్‌ తో పాటు కొబ్బరి, కోకో, జామ తోటలను సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అధిక లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు. దీని కోసం పంటకాలం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో రైతులకు ప్రభుత్వం రాయితీలు కూడా అందిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగులో రాయలసీమ రీజియన్‌ మిగతా ప్రాంతాల కంటే ముందుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44.88 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతుతుండగా దానిలో 39 శాతం విస్తీర్ణం రాయలసీమలోనే ఉండటం విశేషం. అధికారిక గణాంకాల ప్రకారం రాయలసీమలోని బోరు బావుల కింద పండితే పండింది..లేదంటే లేదన్నట్టుగా గతంలో వరిని సాగు చేయగా ఇపుడు అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి తోటల పెంపకం వైపు రైతులు దృష్టి కేంద్రీకరించారు. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి, జీడి మామిడి, ఆయిల్‌ పామ్‌, కొబ్బరి తోటలవైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంపుదల చేసేందుకు అనువైన ప్రాంతాలను రాష్ట్ర ఉద్యానవన శాఖ గుర్తించి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

- Advertisement -

అయిల్‌ పామ్‌..తరువాత మామిడి

ఉద్యాన పంటల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం వేగంగా పెరుగుతోంది. 2021-22లో 27,923 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ను అదనంగా రైతులు సాగు చేయగా 2022-23లో సుమారు మరో 30 వేల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. అయిల్‌ పామ్‌ తరువాత మామిడి సాగు విస్తీర్ణం పెరుగుదల రెండోస్థానంలో ఉంది. 2021-22లో 26,114 ఎకరాల్లో మామిడి సాగు విస్తీర్ణం పెరగ్గా 2022-23లోనూ కనిష్టంగా 25 వేల ఎకరాల్లో అదనంగా పండించే అవకాశం ఉందని అంచనా. అరటి, జీడిమామిడి, బత్తాయి, కోకో, కొబ్బరి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది 1.34 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంపుదల చేయాలని లక్ష్యంగా ప్రకటించి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement