Thursday, April 25, 2024

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి

ఏపీ రాజధాని అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. గతంలో దమ్మాలపాటి అమరావతిలో రాజధాని వస్తుందన్న సమాచారంతో ముందే భూములు కొనుగోలు చేశారని వైసీపీ సర్కారు ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో దమ్మాలపాటి కూడా భాగస్వామేనని చెబుతోంది.

దీనిపై ఏసీబీ విచారణ చేయగా.. దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో హైకోర్టు ఏసీబీ దర్యాప్తుపై స్టే ఇవ్వడం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడ చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొన్నిరోజుల కిందట కొట్టివేసింది. ఇక ఈ కేసు నిలబడే అవకాశం లేకపోవడంతో, దమ్మాలపాటిపై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది గురువారం నాడు సుప్రీంకోర్టుకు తెలిపారు.

కాగా ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఇవాళ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం… నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావాలని హైకోర్టుకు స్పష్టం చేసింది.

ఈ వార్త కూడా చదవండి: ప.గో. జిల్లాలో రైతుల మహాపాదయాత్ర

Advertisement

తాజా వార్తలు

Advertisement