Wednesday, May 1, 2024

AP | టెలీ-మానస్‌తో ఒత్తిళ్ళకు చెక్‌… సేవల్ని విస్తృతం చేసేందుకు యాక్షన్‌ ప్లాన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: మానసిక ఆరోగ్య పరి’రక్షణ’ కోసం ఏర్పాటు చేసిన టెలీమానస్‌ సేవల్ని విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్‌ రూపొందించింది. టెలిమానస్‌ కేంద్రానికి సంబంధించిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ ను అన్ని గ్రామ పంచాయతీలు, స్కూళ్లు, కళాశాలల్లో ప్రముఖంగా ప్రదర్శించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతోపాటు మానసిక ఆందోళన, నిరాశ నిస్పృహలు, ఆత్మహత్యా ధోరణి, వస్తువుల విధ్వంసం వంటి అంశాలకు సంబంధించిన లక్షణాల్ని గుర్తించే విషయంలో స్కూళ్లు, కాలేజీలలోని టీచర్లు, లెక్చరర్లకు అవసరమైన శిక్షణను ఇవ్వటం ద్వారా విద్యార్ధులలో ఇటువంటి ధోరణుల్ని మొగ్గలోనే తుంచి వేసి, వారి భవితకు బంగారు బాటల్ని వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

మానసిక ఆరోగ్య పరిరక్షణా విషయంలో విద్యార్ధులలో అవగాహన కలిగించేందుకు వీలుగా 10వ తరగతి, జూనియర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్ధులకు అవగాహనా తరగతులు నిర్వహించి వారు తమ సమస్యల్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు వీలుగా వారిలో ఒకరిని నోడల్‌ పర్సన్‌ (సంధానక)గా నియమించింది. దీనితో పాటు అన్ని వర్గాల ప్రజల్లోనూ మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు వీలుగా స్వయం సహాయక గ్రూపులు, అంగన్వాడీలు, పోలీసు వంటి ప్రభుత్వ విభాగాలతో పాటు- సాధారణ ప్రజలకు కూడా అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.

- Advertisement -

నిరంతర సేవలు

ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకనుగుణంగా గతేడాది అక్టోబర్లో రాష్ట్రస్థాయి మానసిక ఆరోగ్య వైద్య కేంద్రం ‘టెలిమానస్‌’ హెల్ప్‌ లైన్‌ను విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాల ఆవరణలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మానసిక సమస్యలున్న వారు 14416 నంబరుకు సంప్రదించేలా ఈ హెల్ప్‌ లైన్‌ ను గతేడాది అక్టోబర్‌ లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ కేంద్రంలో కన్సల్టెంట్లు, సైకియాట్రిస్టులు, నర్సులు, సైకలాజికల్‌ సోషల్‌ వర్కర్లు, కౌన్సెలర్లతోపాటు, ఒక సాంకేతిక సలహాదారుతో కూడిన బృందం నిరంతరం సేవలందిస్తోంది. వ్యక్తులకు సంబంధించిన ఆందోళన, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యా ధోరణి వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు అవసరమైన సలహాలు, సూచనల్ని అందజేయటం ద్వారా ఈ బృందం బాధితులకు సాంత్వన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ కేంద్రం పనిచేయడం ప్రారంభించాక ఏడాది కాలంలో తమ సమర్ధవంతమైన కౌన్సెలింగ్‌ ద్వారా 63 మంది ఆత్మహత్యా యత్నాలను బృందం సభ్యులు నిరోధించగలిగారు. ఇప్పటి వరకు 12 వేలకు పైగా కాల్స్‌ వచ్చాయి.

ఆత్మ విశ్వాసాన్ని పెంపు

ఇటీవలి కాలంలో అనేక కారణాలతో వెలుగు చూస్తున్న మానసిక ఆరోగ్య సమస్యలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. . ప్రాణాంతకమైన క్యాన్సర్లు, ఇతర వ్యాధులతో పోల్చుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలతో అర్ధాంతరంగా తనువు చాలించే వారి సంఖ్య గణనీయంగా పెరగడం గమనించదగ్గ విషయం. ఇలా మానసిక కుంగుబాటుకు గురైన వారికి టెలిమానస్‌ కేంద్రంలోని నిపుణులు మనో ధైర్యాన్ని కలిగించి, వారికి జీవితంపై ఆశల్ని చిగురింపజేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేంద్రాన్ని సంప్రదించే వారిలో కుటుంబ కలహాలతో ఒత్తిళ్లకు గురవుతున్న వారు, విఫల ప్రేమికులు, వివాహేతర సంబంధాలతో కాపురాల్ని చేజేతులా కూల్చుకుంటున్న వారు, ఆత్మీయులు దూరమైనపుడు మానసికంగా ఒత్తిడికి గురవుతున్న వారు, సెల్‌ ఫోన్లకు బానిసలై చదువు, ఇతర పనులపై శ్రద్ధ చూపలేకపోతున్నవారు వంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్న వారు ఈ కేంద్రానికి ఫోన్‌ చేసి ఇక్కడి నిపుణుల సలహా సూచనలతో సాంత్వన పొందుతూ ఆత్మవిశ్వాసాన్ని పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ కేంద్రంలో సేవలు పొందాలనుకునే వారి కోసం దేశవ్యాప్తంగా 14416 టోల్‌ ఫ్రీ నెంబరు అందుబాటులో వుంది. ఎవరు ఎక్కడి నుండి ఈ నెంబరుకు ఫోన్‌ చేసినా సంబంధిత రాష్ట్ర కేంద్రానికి వారి కాల్‌ అనుసంధానమవుతుంది. అక్కడి నిపుణులు వారి సమస్యల్ని ఓపిగ్గా విని సలహా, సూచనలతో అవసరమైన ఉపశమనాన్ని అందిస్తున్నారు. టెలిమానస్‌ కేంద్రం నిపుణులకు బెంగళూరులోని నివ్హూన్స్‌ అవసరమైన శిక్షణను అందించింది. వీరికి ఐఐఐటి వారు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. ఏ భాషకు సంబంధించిన వ్యక్తి అయినా తమ సమస్యను తెలియచేస్తే ఆయా భాషల్లోనే వారికి చక్కటి పరిష్కారాన్ని అందచేయటం ఇక్కడి వైద్యనిపుణులు, సిబ్బంది ప్రత్యేకత. నిత్యజీవితంలో ఒత్తిడులు, నిద్రలేమి, ఆందోళన, పరీక్షల సమయంలో ఒత్తిడి వంటి కారణాలతోనే అధికశాతం మంది టెలిమానస్‌కు కాల్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement