Sunday, April 28, 2024

TS | అర్హులైన జర్నలిస్టుందరికీ ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు: అల్లం నారాయణ

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఇళ్ల స్థలాల విషయంపై చర్చించేందుకు సిక్స్‌మెన్‌ కమిటీ సభ్యులు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో హైదరాబాద్‌ మీడియా అకాడమీ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. బ్యూరోలు, స్టాఫ్‌ రిపోర్టర్లు, ఫొటో, వీడియో జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశాల వివరాలను అల్లం నారాయణకు వివరించారు. రెండు హౌసింగ్‌ సొసైటీల్లో లేని వర్కింగ్‌ జర్నలిస్టుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై వివరంగా చర్చించారు.

రెండు హౌసింగ్‌ సొసైటీల్లో లేని జర్నలిస్టుల జాబితాను వెంటనే తయారు చేయాలని సిక్స్‌మెన్‌ కమిటీని ఆయన సూచించారు. విధి విధానాలను ప్రకటించి రెండు మూడు రోజుల్లోనే అర్హులైన వర్కింగ్‌ జర్నలిస్టుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందించాలని కోరారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి పరిశీలించి, ఆయా సర్వే నంబర్లతో సహా జాబితాను రూపొందించి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పారు. వారం పది రోజుల్లో ఈ పని అంతా పూర్తి చేసి.. తుది జాబితా అందిస్తే అందరికీ ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తానని అల్లం నారాయణ అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్‌ను కలిసిన వారిలో సిక్స్‌మెన్ కమిటీ కన్వీనర్‌ బీఆర్‌.లెనిన్‌, సభ్యులు, గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి సదయ్య, టీయూడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్‌, ఏకశిల హౌసింగ్‌ సొసైటీ సలహాదారు అనిల్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement