Friday, May 10, 2024

గెలిచే సీటేది… గెలిపించే పార్టీ ఏదీ?

అన్ని పార్టీల్లో ఎవరికి వారు సొంత సర్వేలు
ముందస్తు ప్రచారంతో మరింతగా దూకుడు
గెలుపోటములపై సొంత అంచనాలకు నడుంకట్టిన నేతలు
మరోవైపు సిట్టింగ్‌ల బలాబలాలపై వైసీపీ అధిష్టానం దృష్టి
అదేదారిలో తెలుగుదేశం పార్టీ… ఎక్కడికక్కడ పకడ్బందీ నివేదికలు
నేతల మధ్య సర్దుబాట్లకు రంగంలోకి దిగిన సీఎం జగన్‌
ఆనం విజరు ఫ్యామిలీతో భేటీ… నెల్లూరు జిల్లాపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి
అదే జిల్లాపై చంద్రబాబూ ఫోకస్‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో స్పష్టంగా తెలియక పోయినప్పటికీ ప్రధాన పార్టీలు మాత్రం మరోసారి సొంత సర్వేలకు సిద్ధమవు తున్నాయి. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌లు, ఆశావహుల బలాబలాలపై సర్వే చేయించి నివేదికలు తెప్పించుకున్న వైసీపీ , తెలుగుదేశం పార్టీలు తాజాగా మరోసారి సొంత సర్వేలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారాన్ని సొంతం చేసుకోవడమే ధ్యేయంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అందుకోసం సర్వే నివేదికలనే ప్రధాన ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యూహాత్మకంగా అడుగు లు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నాయి.

ఇదే సందర్భంలో సిట్టింగ్‌ శాసనసభ్యులతో పాటు టికెట్లు ఆశించే బలమైన నేతలు కూడా వ్యక్తిగతంగా సొంత సర్వేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీతో పాటు టీడీపీ మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలు కూడా తాము ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయో స్పష్టంగా తెలుసుకునేందుకు బలమైన సంస్థల ద్వారా సర్వే చేయించు కుంటున్నారు. మరికొన్ని నియోజక వర్గాల్లో సర్వేలకు సిద్ధమవుతూ ఆయా ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన వారి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్రచారం మొదలైంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల అంశంపైనే చర్చలు జరిగాయని వారి చర్చల సారాంశాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంత సర్వేలకు అత్యధిక మంది నేతలు మొగ్గుచూపు తున్నారు. ఎవరికి వారే తాము ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి..? ఇదే స ందర్భంలో ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే విజయావకాశాలు అనుకూలంగా ఉంటాయి అని తెలుసుకునేందుకు సర్వే మంత్రం జపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి నోట విన్నా సర్వేల మాటే వినపడుతుంది.

- Advertisement -

సిట్టింగ్‌ల బలాబలాలపైనా… వైసీపీ అధిష్టానం ప్రత్యేక సర్వేలు..

గత ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో గెలుపొందిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసం సీఎం జగన్‌ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపు తున్నారు. అందుకోసమే గత ఏడాది మే 11 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్య క్రమంపై కూడా ప్రత్యేకంగా ఆయ న సర్వే జరిపించి ఆ నివేదికల ఆధా రంగా ప్రతి 45 రోజులకు వర్క్‌ షాప్‌ను నిర్వహించి సమీక్ష చేస్తు న్నారు. అయితే ఇప్పటికే ఒకటికి రెండుసార్లు 175 నియోజకవ ర్గాల్లొని ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌ల పనితీ రుపై సర్వే జరిపించిన ఆయన తాజాగా మరోసారి అభ్యర్థుల బలాబలాలపై సమగ్ర సర్వేకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ శాసనసభ్యుల పనితీరుతో పాటు ఆ నియోజకవర్గంలో గెలవాలంటే ఎవరిని బరిలోకి దించితే తిరిగి ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటామో అని ఓ అంచనాకు వచ్చేందుకు కూడా ఒకటికి రెండు పేర్లపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక సర్వే బృందాలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. జనవరి, ఫిబ్రవరి నెలాఖరు లోపు సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా మార్చిలో పోటీచేసే అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే యోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించేలా సర్వే రిపోర్ట్‌ల ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేసే దిశగా సీఎం జగన్‌ అడుగులు వస్తున్నట్లు తెలుస్తోంది.

సర్వేలపై టీడీపీ గురి..

బాదుడే – బాదుడే, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఇలా ప్రత్యేక కార్యక్రమాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్య టిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బలమైన అభ్యర్థు లను రంగంలోకి దించాలని టీడీపీ అధిష్టానం కూడా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీని ధీటుగా ఎదుర్కొనే నేతనే రంగంలోకి దించాలని ఆ దిశగా ఆయా జిల్లాల పరిధిలో బలమైన నేతల పనితీరుపై సొంత సర్వేలను చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో అనుకూలంగా నివేదికలు వచ్చిన వారితో చర్చలు జరిపి ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. అయితే ఇప్పటికే ఒకట్రెండు సర్వేలను చేయించిన టీడీపీ ముచ్చటగా మూడోసారి అభ్యర్థుల విషయంలో క్లారిటీకి వచ్చేందుకు మరోసారి సర్వేలపై గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ముందస్తు ప్రచారంతో…. దూకుడు పెంచుతున్న వైసీపీ, టీడీపీలు..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించడం, దాన్ని అధికార పక్షం ఖండించకపోవడంతో దాదాపుగా ముందస్తే వస్తాయని అందరూ స్పష్టతకు వస్తున్నారు. ఈ తరుణంలో అధికార పక్షంతోపాటు- ప్రతిపక్షం లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నేతలంతా తమ దృష్టిని సర్వేలపై నిలిపారు. ప్రధాన పార్టీ ల అధినేతలు కూడా ఒక్కసారిగా దూకుడు పెంచుతున్నారు. ఆయా జిల్లాలపై ఫోకస్‌ కూడా పెంచారు. ఈ నేపథ్యంలో వైసీపీ కానీ, టీ-డీపీకానీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటు-న్నాయి. ఆ నివేదికల్లో ఏముందో తెలుసుకోవడానికే నాయకులంతా వారి వారి ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి? తమకు గెలుపు అవకాశాలున్నాయా? ప్రత్యర్థి పార్టీల పరిస్థితి ఏమిటి? ఒకవేళ సీటు- రాకపోతే ప్రత్యర్థి పార్టీలో అవకాశం ఉంటు-ందా? అక్కడ గెలవడానికి అవకాశం ఉందా? తదితర విషయాలన్నీ నేతలను కుదురుగా ఉండనీయడంలేదు. రానున్న ఎన్నికలు రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యలా మారాయి. దీంతో ఏ పార్టీకా పార్టీ కచ్చితంగా గెలవడానికే చూస్తోంది.
అందుకే గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా నిలపడానికి ప్రయత్నిస్తున్నాయి. వైసీపీలో దాదాపుగా అందరు ఎమ్మెల్యేలకు జగన్‌ పచ్చజెండా ఊపారు. పనితీరు మార్చుకోనివారిని చివరి నిముషంలో సీటు- నిరాకరించే అవకాశం కనపడుతోంది. సర్వేలో తమకు సానుకూలత లేదన్నా, సీటు- రాదనే సమాచారం ఉన్నా బలమైన పార్టీలో చేరదామను కుంటూ ప్రణాళికలు రచించుకుంటు-న్నారు. కొందరు తమ ప్రత్యర్థి పార్టీల నేతల్లోకి అందుబాటు-లోకి వస్తున్నారు.

సీఎం జగన్‌తో ఆనం విజయ్‌ ఫ్యామిలీ భేటీ..

ఇదిలా ఉండగా సీఎం జగన్‌ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నెలకొని ఉన్న అంతర్గత విభేదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీకి కంచుకోటగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై ఫోకస్‌ పెంచారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామ్‌నారాయణ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆనం రామ్‌నారాయణ రెడ్డి సోదరుడు ఆనం విజయ్‌కుమార్‌ రెడ్డి కుటుంబంతో సోమవారం సీఎం జగన్‌ సమావేశం కావడం ప్రధాన చర్చానీయంశంగా మారింది. రామ్‌ నారాయణ రెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో విజయ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబ సమేతంగా సీఎం జగన్‌తో భేటీ కావడం చూస్తుంటే నెల్లూరు జిల్లా విషయంలో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా నెల్లూరు విషయంలో రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ జిల్లాపై ఫోకస్‌ పెంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement