Saturday, May 4, 2024

విజేతలుండని యుద్ధమిది.. ప్రాణ, ఆస్తినష్టం తప్ప ఏమీ మిగలదు: ఐరాస

న్యూయార్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో విజేతలుండే అవకాశమే లేదని, తక్షణం ఆపి ఇరుదేశాల్లో ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి ఉక్రెయిన్‌ సంక్షోభ నివారణ సహాయకుడు అవద్‌ పిలుపునిచ్చారు. వందరోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరువైపులా భారీ ప్రాణనష్టం, ఉక్రెయిన్‌లో ఆస్తుల విధ్వంసం చూశామని, లక్షలాదిమంది వలసవెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ప్రపంచదేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభానికి కారణమవుతోందని అన్నారు. ఈ వందరోజుల్లో ఏమీ సాధించలేదని, ప్రాణాలు, ఇళ్లు.. ఉద్యోగాలు, చివరకు భవిష్యత్‌ను కోల్పోయారని అవద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ యుద్ధాన్ని పౌరసమాజం వ్యతిరేకిస్తోందని, పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా నేలమట్టమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, ప్రార్థనాస్థలాలు, ఆస్పత్రులు, ఇళ్లు ఇలా అన్నిరకాల భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అయితే, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐరాస శాయశక్తులా ప్రయత్నిస్తోందని, ఇరు దేశాలు ముందుకు వచ్చి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు యుద్ధాన్ని తక్షణం ఆపాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement