Sunday, April 28, 2024

పోలీస్ కమిషనర్ చిత్రపటానికి క్షీరాభిషేకం.. ఓరుగల్లులో అరుదైన ఘటన

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులకు బ్రహ్మరథం పట్టడం చూసి ఉంటాం. సర్కార్ ఎవరికైనా ప్యాకేజీలు ప్రకటించిన, ఏదైనా వర్గానికి వరాలు కురిపించిన సదరు ముఖ్యమంత్రులకు క్షీరాభిషేకాలు చేస్తూ అభిమానం, కృతజ్ఞతలు చాటుకుంటారు. కానీ ఓరుగల్లులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవి.రంగనాథ్ చిత్రపటానికి వరంగల్ నగరంలోని కాశిబుగ్గ జంక్షన్లో ఓ దివ్యాంగుడు క్షీరాభిషేకం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. 40 ఏళ్ళ నాటి పూర్వీకుల నుండి సంక్రమించిన 250 గజాల స్థలమును కబ్జాచేయడానికి ప్రయత్నిస్తున్న భూబకాసురుడి అకృత్యాలు, ఆగడాలను గుర్తించి, తనకు అండదండగా నిలిచిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ను రియల్ హీరోగా భావిస్తూ సయ్యద్ అసద్ (దివ్యాంగుడు) శుక్రవారం పాలాభిషేకం చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు.

- Advertisement -

వరంగల్ పోలీస్ బాస్ ఏవి రంగనాథ్ తీసుకొన్న చొరవతోనే ఇంతేజార్ గంజ్ ఇన్స్ పెక్టర్ దగ్గు మల్లేష్, సిబ్బంది తన భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడి తనకు అండదండగా నిలవడం వలననే పూర్వీకుల నుండి వచ్చిన 250 గజాల స్థలం దక్కిందని సయ్యద్ అసద్ (దివ్యాంగుడు) భావిస్తున్నారు. అందుకే వరంగల్ నగరంలోని కాశిబుగ్గ జంక్షన్ లో అసద్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరంగల్ పోలీస్ బాస్ కు దక్కిన అరుదైన, ఆసాధారణ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement