Saturday, May 18, 2024

AP | కోస్తా తీరంలో బీచ్‌లకు కొత్త కళ.. 12 జిల్లాల్లో 373 బీచ్‌ల అభివృద్ధి

అమరావతి, ఆంధ్రప్రభ : కోస్తా తీరంలోని బీచ్‌లు కొత్త కళను సంతరించుకోనున్నాయి. 972 కిలో మీటర్ల మేర మూడో అతిపెద్ద సముద్రతీర రాష్ట్రంగా ఏపీ ఉంది. సముద్రీ తీర ప్రాంతాల్లో చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది లేని రీతిలో పర్యావరణ అనుకూల బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. తద్వారా ఉపాధి, సేవల రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన కోస్టల్‌ జోన్‌ రెగ్యులేషన్‌ చట్టంను అనుసరించి తీర ప్రాంతంలో బీచ్‌లను అభివృద్ధి చేస్తారు.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంబడి 373 బీచ్‌లను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం, పర్యాటక, మత్స్యశాఖలతో కూడిన 11 ప్రత్యేక బృందాలు తీరం వెంట సర్వే నిర్వహించి బీచ్‌ల అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కోస్టర్‌ టూరిజం పేరిట మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయనున్నారు. కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం బీచ్‌ల అనుమతి కోసం పర్యాటక శాఖ జిల్లా కలెక్టర్లను బీచ్‌ల అభివృద్ధిపై వివరాలు కోరింది.

జిల్లా కలెక్టర్లు ఖరారు..

- Advertisement -

జిల్లా స్థాయిలో పర్యాటక కౌన్సిల్స్‌ సమావేశమై బీచ్‌ల అభివృద్ధిని ఖరారు చేస్తాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు మత్స్యకారులు, టూరిజం ఆపరేటర్లను భాగస్వాములు చేసుకొని బీచ్‌ల అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లు పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. కొద్ది రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో బీచ్‌ల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అత్యధికంగా శ్రీకాకుళంలో 67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయగనరం 14, విశాఖపట్టణం 32, అనకాపల్లి 35, కాకినాడ 22, కోనసీమ 20, పశ్చిమగోదావరి 10, కృష్ణా 26, బాపట్ల 33, ప్రకాశం 23, నెల్లూరు 63, తిరుపతి 26 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు.

ఏకో టూరిజంపై దృష్టి..

రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధిపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఏకో టూరిజం అనుకూల ప్రాంతాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవడం ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. గుర్తించిన ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం కూడా చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మెరుగైన ఉపాధి..

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అపారమైన వనరులు ఉన్నాయి. అతిపెద్ద సముద్ర తీరం ఉండటంతో పాటు అందమైన కొండలు, ఆకట్టుకునే నదీ పరివాహక ప్రాంతాలు, సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తగిన మౌళిక సదుపాయాలు కలిపిస్తే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దితే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. బీచ్‌ల అభివృద్ధి ద్వారా సేవల రంగం సైతం విస్తరిస్తుంది.

ఇప్పటికే హోటల్స్‌, రిసార్టుల అభివృద్ధికి అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుల్లో ఒక్క పర్యాటక రంగంలోనే వందకు పైగా ఒప్పందాలు జరిగాయి. తద్వారా రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు. ఓ వైపు బీచ్‌ల అభివృద్ధి ద్వారా రిసార్టులు, హోటల్స్‌ ఏర్పాటు పెద్ద ఎత్తున జరుగుతుంది. ట్రావెల్‌ రంగం విస్తరిస్తుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని అధికారులు చెపుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులు అవసరమైన కార్యాచరణ రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement