Saturday, May 4, 2024

AP | వార్డు సచివాలయానికో వైద్య శిబిరం.. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల క్యాంపులు

అమరావతి, ఆంధ్రప్రభ: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సచివాలయం పరిధిలో కూడా ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించాలని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, ఆ మేరకు సోమవారం నుంచి అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గం, బాకన్నపాలెంలో నిర్వహించిన వైద్య శిబిరానికి మంత్రి విడదల రజిని హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నిర్వహించాలని తొలుత భావించామని, అయితే ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు.

పట్టణ ప్రాంతాల్లో ప్రైమరీ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ఒకటి కాకుండా, ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించేలా జగనన్న ఆదేశించారని చెప్పారు. సోమవారం నుంచే ఆ మేరకు శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల వరకు వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 13 వ తేదీలోపు ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 23.78లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని వెల్లడించారు.

తొలి 14 రోజుల్లో 6334 వైద్య శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. వీరిలో 52,666 మందికి మెరుగైన వైద్యం అవసరమని గుర్తించామని, వీరిని పెద్ద ఆస్పత్రుల్లో చేర్పించి ఉచితంగా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యం మెరుగయ్యి ఆనందంగా ఉన్నప్పుడే వీరి కేసును ఆన్‌లైన్‌ లో సిబ్బంది తొలిగిస్తారని వెల్లడించారు.

- Advertisement -

ఉచితంగా మందులు, టెస్టులు

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులు పాల్గొని సేవలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. వచ్చిన రోగులకు ఉచితంగా కన్సల్టేషన్‌తో పాటు మందులు, టెస్టులు అందిస్తున్నామని చెప్పారు. గతంలో కేవలం 1059 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందేవని, ఇప్పుడు మాత్రం 3257 రకాల చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం కోసం, మంచి వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నోగొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్‌ మన దేశానికే ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement