Sunday, May 19, 2024

AP | రవాణా శాఖ కీలక నిర్ణయం.. నేటి నుంచి డిజిటల్‌ సేవలు మొదలు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న మానవుడు అంతే వేగంగా తమ అవసరాలను పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే ప్రపంచమంతా డిజిటల్‌ రంగం వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మరో అడుగు ముందుకేస్తూ రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్‌సీ బుక్‌లను డిజిటల్‌ రూపంలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.

అందులో భాగంగానే రవాణా శాఖ పాత విధానానికి స్వస్తి పలుకుతూ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఏర్పాట్లు చేపట్టింది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందే వారు రోజుల తరబడి కార్డుల కోసం ఎదురు చూసే ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే వాహనాలు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి జరిగే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తర్వాత సంబంధిత వాహన యజమానులకు ఆర్‌సీ పుస్తకాలను ఇవ్వాలి.

- Advertisement -

అయితే ప్రస్తుతం కార్డుల కొరతతో రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్‌సీ పుస్తకాల కోసం నెలల తరబడి కొన్ని సందర్భాల్లో అయితే సంవత్సరం పైగా పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిజిటల్‌ కార్డుల కొరత కూడా తీవ్రంగా ఉంది. పైపెచ్చు ఆర్థికంగా కూడా భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ వైపు ఆలోచన చేస్తూ వాటిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో రాష్ట్రంలోని వాహనదారులకు, లైసెన్స్‌ దరఖాస్తుదారులకు చాలా వరకు ఇబ్బందులు తీరబోతున్నాయి. ఇప్పటి వరకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాక 30 రోజుల తర్వాత ఎల్‌ఎల్‌ఆర్‌, ఆ తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పోస్టల్‌ ద్వారా పంపే వారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీ బుక్‌లు జారీలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

తాజాగా డిజిటల్‌ విధానం అమల్లోకి రావడంతో కేవలం 48 గంటల్లోనే వాహనాలకు సంబంధించిన ఆర్‌సీ బుక్‌లు డిజిటల్‌లో అందుబాటులోకి వస్తాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా 30 రోజులు ముగిశాక అదే విధానం ద్వారా డిజిటల్‌ సిస్టమ్‌లో వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి.

వాహనదారులకు.. మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం..

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచం డిజిటలైజేషన్‌ వైపు మొగ్గుచూపుతోంది. ఆధునిక అవసరాలకు తగ్గట్లుగానే రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుని ఆ దిశగా డిజిటల్‌ వైపు అడుగులు వేస్తోంది. డిజిటల్‌తో పాటు ఎం – పరివాహన్‌ అప్లికేషన్‌లో వాటిని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేపడుతోంది. లైసెన్స్‌ కోసం సాధారణంగా గతంలో రవాణా శాఖ దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రింటింగ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ కార్డులను సరఫరా చేసేవారు.

అందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ కోసం కార్డుకు రూ. 200, పోస్టల్‌ ఛార్జీలు రూ. 35 వసూలు చేసేవారు. శుక్రవారం నుంచి పాత విధానానికి స్వస్తి పలుకుతూ రవాణా శాఖ డిజిటల్‌ విధానాని కి శ్రీకారం చుట్టింది. దీంతో శనివారం నుంచి వాహనదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 25 లక్షలకు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సమస్యను అధిగమించి కార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా.. కార్డుల జారీలో జాప్యం జరుగుతూనే ఉంది.

డిజిటల్‌ కార్డులు ఎలా పనిచేస్తాయి..?

రవాణా శాఖ కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న డిజిటల్‌ కార్డులు డీజీ లాకర్‌, ఎం – పరివాహన్‌ అనే మొబైల్‌ అప్లికేషన్‌లో వీటిని అందుబాటులో ఉంచబోతోంది. ఆ దిశగానే రవాణా శాఖ ప్రకటించబోతోంది. డిజిటల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, డిజిటల్‌ ఆర్‌సీ కార్డులు జారీ విధానం మరింత సులభతరం కాబోతోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 1500కు పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. ఆ లెక్కన నెలకు సుమారు 45 వేలకు పైగా కార్డులను అందించాల్సి వస్తోంది. ఆర్‌సీ కార్డులైతే నెలకు 3 లక్షలకు పైగా జారీ చేయాల్సి వస్తోంది. డిజిటల్‌ విధానం అందుబాటులోకి రావడంతో అతి తక్కువ సమయంలోనే వారికి డిజిటల్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement