Monday, April 29, 2024

విశాఖలో డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి.. రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్‌ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్‌ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో డ్రోన్‌ టెక్నాలజీ ఒకటని, ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా రంగాలతోపాటు అనేక రంగాలలో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిందని అన్నారు. డ్రోన్‌ టెక్నాలజీ, వినియోగంలో దేశం ముందంజలో ఉందని, దీనిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.

ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందులు చల్లేందుకు, పొలాల్లో తేమ శాతాన్ని పర్యవేక్షించేందుకు, పంట ఎదుగుదలో వివిధ దశలకు సంబంధించిన  సమాచారాన్ని రాబట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. డ్రోన్‌ టెక్నాలజీ సాయంతో తక్కువ శ్రమతో రైతులు పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతాంగం ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. అలాగే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో రాష్ట్రం అపారమైన మానవ వనరులను కలిగి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఐటీ నిపుణులు అనేక నూతన ఆవిష్కరణలతో తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తుచేశారు.

- Advertisement -

ఆహార ధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయల సాగులో  అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని అన్నారు. రైతులు క్రమేణా ఆయిల్‌ పామ్‌ సాగు వైపు కూడా మళ్ళుతున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన పురోగతి సాధించడం ద్వారా రైతులు దేశ ప్రగతికి తోడ్పడుతున్నందున వారికి ఎంతగానో ఉపకరించే డ్రోన్ల పరిజ్ఞానాన్ని మరింత విస్తృతపరచేందుకు విశాఖపట్నంలో జాతీయ డ్రోన్‌ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement