Saturday, March 16, 2024

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈ ఏడాదిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున, ఓ ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ బలవర్ధకమైన తృణధాన్యాలను దైనందిన ఆహారంలో భాగంగా మార్చేందుకు వాటితో కలిగే లాభాలు, ప్రయోజనాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో వివరిస్తూ వాటి వినియోగం పెంచేలే బ్రాండింగ్ చేయడం, ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -

జాతీయ ఆహార భద్రత మిషన్‌లో చిరుధాన్యాలను కూడా భాగం చేసి దేశంలోని 14 రాష్ట్రాలలోని 212 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 5 ఏళ్ళలో 2150.39 టన్నులు వివిధ రకాల చిరుధాన్యాలను ఉత్పత్తి చేసినట్టు మంత్రి వెల్లడించారు. 2016-17లో 453.67 టన్నులు, 2017-18లో 301.91 టన్నులు, 2018-19లో 413.19 టన్నులు, 2019-20లో 540.61 టన్నులు, 2021-22 లో 340.01 టన్నుల చిరుధాన్యాలను ఆంధ్రప్రదేశ్‌ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో 81350.25 టన్నులు చిరుధాన్యాలు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 

చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జాతీయ ఆహార భద్రత మిషన్ కింద వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక ఉప-మిషన్‌ను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా ప్రోత్సాహకాలు అందించడం, మేలు రకం విత్తనాల అభివృద్ధి, ప్రదర్శనలు, చీడ పీడల నివారణా చర్యలు, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి చిరుధాన్యాల సాగు పరిశోధనలపై పెట్టుబడులు పెడుతోందని, స్టేక్ హోల్డర్లకు అవగాహన కల్పిస్తోందని నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement