Monday, April 29, 2024

మహీంద్రా లాభంలో 14 శాతం వృద్ధి.. క్యూ3లో నికర లాభం 1,528 కోట్లు

హైదరాబాద్‌ : ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 14 శాతం వృద్ధితో 1,528 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1335 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ ఈబీఐటీడీఏ 56 శాతం పెరిగి 2,814 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 41శాతం పెరిగి 21,654 కోట్లకు చేరింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 15,348 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిది. ఈ త్రైమాసికంలో మొత్తం 1,76,094 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం విక్రయించిన 1,21,167 వాహనాల కంటే ఇది 45 శాతం ఎక్కువ. ట్రాక్టర్ల విక్రయాల్లో 14 శాతం వృద్ధితో 1,04,850 వాహనాలను విక్రయించినట్లు ఎం అండ్‌ ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనీష్‌ షా శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరం 9 నెలల కాలంలో కంపెనీ ఆదాయం 62,389 కోట్లుగా ఉంది.

కంపెనీ ఎస్‌యూవీ సిగ్మెంట్‌లో మార్కెట్‌ లీడర్‌గా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలోని జహీరాబాద్‌ లో కొత్తగా ఈవీ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక్కడ కంపెనీ నుంచి రానున్న కొత్త ఈవీ వాహనాలను తయారు చేయనున్నట్లు తెలిపారు. వెయ్యి కోట్లతో ఈ ప్లాంట్‌ను విస్తరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కంపెకనీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పటికే ఇక్కడ జిత్తు ఈవీ ఆటోలను తయారు చేస్తోంది. ఎక్స్‌యూవీ 400 వీకి 13 రోజుల్లో 15 వేల బుకింగ్స్‌ వచ్చాయని చెప్పారు. 2027 నాటికి కంపెకనీ ఉత్పత్తి చేసే వాహనాల్లో ఈవీల వాటా 20-25 శాతం వరకు ఉంటుందని చెప్పారు. మీడియా సమావేశంలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ జిజుర్కర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ మనోజ్‌ భట్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement