Sunday, April 28, 2024

హైదరాబాద్ : కోటి వృక్షార్చన విజయవంతం- భాగస్వాములైన అందరికీ ఎంపీ కృతజ్ణతలు

ఎంపీ సంతోష్ కుమార్

ముఖ్యమంత్రి  కల్వకుంట్ల  చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు సందర్భంగా హరిత కానుకను ఇవ్వాలన్న సంకల్పం వంద శాతం నెరవేరిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నాగోల్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానికులతో కలిసి మొక్కలు నాటడం ద్వారా కోటి వృక్షార్చనను ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోనూ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున తలపెట్టిన కోటి వృక్షార్చన అద్భుతంగా జరిగిందని, పాల్గొన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలని పేర్కొన్నారు.  ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని తలపెట్టిన యజ్ఞం ఊహించిన దాని కన్నా విజయవంతం అయిందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో స్వయంగా ముఖ్యమంత్రే తన పుట్టిన రోజు నాడు రుద్రాక్ష మొక్కనాటడం మరిచిపోలేని అనుభూతి అని జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. తమకు అందుతున్ననివేదికల మేరకు  రాష్ట్రంతో పాటు, దేశ  విదేశాల్లో సీఎం అభిమానులు కోటికి పైగా మొక్కలు నాటారని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. కోటి వృక్షార్చన విజయవంతంతో బాధ్యత మరింత పెరిగిందని, నాటిన ప్రతీ మొక్కను వంద శాతం బతికించాలని పిలుపునిచ్చారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement