Monday, April 29, 2024

కోవిడ్ వేస్తోంది క‌త్తెర‌…

  • అడుగడుగునా కరోనా భయం
  • దశలవారీగా కోవిడ్‌ తరంగాలు
  • ఆశలు, ఆనందాలు… సరదాలు, షికార్లు అట్టడుక్కి
  • జీవంలేని జనజీవనం
  • జీవితమంతా ముప్పు తప్పదన్న భయాందోళనలు
  • బంగారం ధర తగ్గినా పెరగని కొనుగోళ్లు
  • నిస్తేజంగా పర్యాటకం
  • సినిమా థియేటర్లు వెలవెల
  • కుటుంబ సంబంధాలు విలవిల
  • అన్నీ తగ్గుముఖం… ఆర్థిక వ్యవస్థకు చేటు
  • నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ – కోవిడ్‌ జన జీవన శైలిలో తీవ్ర మార్పుతెచ్చింది. దీని ప్రభావం కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ జనంలో కోవిడ్‌ పట్ల భయం తగ్గడంలేదు. దేశంలో బంగారం ధరలు తగ్గాయి. అయినప్పటికీ బంగారం కొనుగోళ్ళకు మహిళలు ఎగబడ్డంలేదు. విదేశాల్లో బంగారాన్ని పెట్టుబడిగా, మదుపుగా మాత్రమే చూస్తారు. కానీ భారత్‌ లో బంగారాన్ని ఆభరణాలుగానే అధికంగా వినియోగి స్తారు. పేద, మధ్యతరగతి మహిళలు బంగారం కొనుగోలు పట్ల విశేషమైన ఆసక్తి ప్రదర్శిస్తారు. తమకున్న బంగారాన్ని బంధువులు, స్నేహితుల సమక్షంలో ప్రదర్శించేందుకు ఎక్కువ తహతహలాడతారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మహిళల్ని బంగారం వైపు కూడా ఆకర్షించడం లేదు. గతంలో మూడ్నాలుగు రోజులు సెలవులొస్తే కుటుంబ సమేతంగా పర్యటనలకెళ్ళేవారు. ప్రభుత్వం కూడా పర్యాటకాన్ని ప్రోత్సహించేది. ప్రభుత్వోద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎల్‌టిసి సదుపాయాన్ని కల్పించేది. కోవిడ్‌ నేపధ్యంలో పర్యాటకం మొత్తం నిర్వీర్యమైంది. ఇల్లొదిలెళ్ళేందుకే సాహసించడంలేదు. గతంలో ఇంట్లో పెళ్ళి అంటే వందలు, వేలాదిమందిని ఆహ్వానించేవారు. అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసేవారు. కాగా ఇప్పు డు పెళ్ళిళ్ళకు ఆహ్వానితుల సంఖ్య పరిమితమైపోయింది. ధైర్యం చేసి పిలిచినా ఎవరూ రావడంలేదు. తప్పనిసరి బంధువులు, దగ్గరి స్నేహితులు మాత్రం తూతూ మంత్రంగా హాజరై ఐదు నిమిషాల్లోనే నిష్క్రమిస్తున్నారు. అలాగే గతంలో సెలవురోజు వచ్చిందంటూ కుటుంబ సమేతంగా సినిమాల కెళ్ళేవారు. అట్నుంచటే హోటళ్ళకెళ్ళేవారు. అర్ధరాత్రి వరకు సరదాగా గడిపి ఆ తర్వాత ఇంటికి చేరేవారు. అలాగే తరచూ బంధువులు, స్నేహితుల ఇళ్ళను చుట్టొచ్చేవారు. ఇప్పుడు ఈ రాకపోకలన్నీ బందయిపోయాయి. నూరుశాతం ప్రేక్షకుల్తో సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ సినిమాలకొచ్చేందుకు జనాన్ని భయం పీడిస్తోంది. రాత్రి ఏడ య్యే సరికి గ్రామాల్తో పాటు పట్టణాలు, నగరాలు కూడా స్తబ్దతగా మారుతున్నా యి. ట్రాఫిక్‌ తగ్గిపోతోంది. ఎవరికి వారు ఇళ్ళకు చేరుతున్నారు. పిల్లలు, పెద్దలు
కూడా టివిలకు అతుక్కుపోతున్నారు. స్నేహితులు, బంధువుల్తో ఫోన్లకే పరిమిత మౌతున్నారు. దేశంలో దాదాపు ప్రతిరాష్ట్రంలోనూ బార్లు తెరుచుకున్నాయి. ఇవి రాత్రి 11గంటల వరకు విక్రయాలు సాగిస్తున్నాయి. గతంలో ఆ సమయం దాటి
కూడా వినియోగదార్లుండేవారు. కానీ ఇప్పుడు ఏడు దాటేసరికే బారుల్లోనూ జనం పలచబడిపోతున్నారు. ఇది మొత్తం అన్ని వ్యవస్థల్ని దెబ్బతీస్తోంది. పెళ్ళిళ్ళ కు, పర్యాటకాలకు, ఆఖరకు బంధువులు, స్నేహితుల ఇళ్ళకు వెళ్ళే అవకాశాలు తగ్గడంతో మహిళలు పట్టుచీరలు, బంగారం కొనడం మానేశారు. దీంతో ఆ రంగా లు కుదేలౌతున్నాయి. ఇప్పటికీ మొదటి విడత పూర్తయింది. కాగా రెండో విడత కోవిడ్‌ మొదలైందంటూ ప్రచారం ఊపందుకుంది. ఆ త ర్వాత మూడో విడత, నాలుగో విడత ఇలా.. మనిషి బ్రతికున్నంత కాలం ఈ వ్యాధి కొనసాగుతుందన్న భయం జనానికి పట్టుకుంది. ఇది జనం బయటకు రాకుండా నిరోధిస్తోంది. జనం దుకాణాలకెళ్ళడంలేదు. షాపింగ్‌ చేయడంలేదు. సినిమాలకెళ్ళడంలేదు. ఓటిటి లేదా సిడిల్లోనే సినిమాలు చూస్తున్నారు. హోటళ్ళకెళ్ళడంలేదు. స్విగ్గీలు, జమోటాల్నుంచే తెప్పించుకుంటున్నారు. ఇతర దేశాల్తో పోలిస్తే భారత్‌లో ఈ భయం అధికంగా ఉంది. దీంతో తిరిగి ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు ఆందోళనకు గురౌతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement