Friday, April 26, 2024

నేటి సంపాద‌కీయం – ముప్పు తొలగిపోలేదు!

దేశవ్యాప్తంగా మళ్ళీ కోవిడ్‌ కేసులు పెరుగు తున్నాయి. ఢిల్లి, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ సహా ఇరవై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నట్టు సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత వారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్త వేరియంట్లతో ముంచుకు వస్తున్న కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దానికి తదుపరి చర్యగా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ విలేఖరులతో మాట్లాడుతూ కోవిడ్‌ రెండు దశల సమయంలో దేశంలోని ప్రధాన నగరాలు,పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు, వెంటిలేటర్లు, ఇతర మౌలిక సదుపాయాలను మళ్ళీ సిద్ధం చేసి ఉంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాక లేఖలు రాయనున్నదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 189 కోట్ల డోస్‌ల పంపిణీ పూర్తి చేసిన దృష్ట్యా కరోనా మళ్ళీ రాదన్న ధీమాతో ఉండటం ఎంత మాత్రం క్షేమకరం కాదనిప్రధానమంత్రి హెచ్చరించారు.ఆరోగ్యమంత్రి తాజా పత్రికాగోష్టిలో కూడాఇదే మాట అన్నారు. కోవిడ్‌-19 మరింత భయంకరమైన వేరియంట్లతో విరుచుకుని పడే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులతో పాటు బిల్‌ గేట్స్‌ వంటి ప్రపంచ ప్రముఖులు కూడా హెచ్చరిస్తున్నారు. మొదటిదశ కోవిడ్‌ విరుచుకుని పడటం వల్ల అప్రమత్తంగా లేకపోవడం కారణం ప్రాణనష్టం బాగా సంభవించింది. రెండవ దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నష్టాలు చాలా వరకూ తగ్గాయి. అదే మాదిరిగా మరోసారి ఆ మహమ్మారి తరుముకుని వస్తే సంసిద్ధంగా ఉండేందుకు కేంద్రం ప్రణాళికను రూపొందించింది. ఎప్పటికప్పుడు వివిధ రూపాలలో సవాళ్ళు విసురుతున్న కోవిడ్‌ను ఎదుర్కోవడానికి కేంద్రం అప్రమత్తంగా ఉంది. ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి నిర్వహిస్తున్న సమావేశాలే ఇందుకు నిదర్శనం.

రాష్ట్రాలు కూడా ఇదే మాదిరి అప్రమత్తత ఉండాలని ప్రధాని అభిలషిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మొదటి వ్యాక్సిన్‌ పంపిణీ సక్రమంగా జరగలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దానిపైఆ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ బృందాలను పంపి వాస్తవ సమాచారాన్ని తెప్పించుకుంది. ఆస్పత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సరఫరా వంటి మౌలిక సదుపాయాల విషయంలో రాష్ట్రాలు శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం ఆదేశిస్తోంది. గత ఏడాది జనవరి 16వ తేదీన టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో 15-18 సంవత్సరాల మధ్యవయస్కులైన వారికి టీకాను అందుబాటులోకి తెచ్చింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా భారత్‌లోనే చురుకైన రీతిలో సాగింది. ఇంకా సాగుతోంది.. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ప్రశంసించాయి. చైనాలో మళ్ళీ కరోనా విజృంభించిన నేపధ్యంలో మన దేశం ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది. టీకాల విషయంలో ప్రజలను చైతన్య పర్చడం వల్లనే వ్యాక్సిన్‌ పంపిణీ ఆశించినదానికన్నా ఎక్కువగా సాగడం వల్లనే మూడవ దశలో కరోనా విజృంభించకుండా అదుపులో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా ఉధృతి తగ్గిందన్న ఆనందంలో సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్‌ లనుధరించడం వంటి జాగ్రత్తలను పాటించకపోవడం వల్లనే ఇరవై రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోందన్న నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకునే మౌలిక సదుపాయాలను పూర్తిగా పక్కన పెట్టొద్దని రాష్ట్రాలకు సూచిస్తోంది. మత, సామాజిక, రాజకీయ పరమైన సమావేశాలు, సమూహాలపై ఆంక్షలు విధించాలన్న సూచనలు చేసినట్టు తెలియవచ్చింది.

కరోనా తొలగిపోయిందన్న నిర్లిప్త భావం అందరిలోనూ ఏర్పడిన మాట నిజమే. కానీ, రక్త సంబంధీకులతోనూ, ఆప్తులతోనూ మాస్క్‌లు ధరించి మాట్లాడే వారు ఇప్పటికీ ఉన్నారు. జాగ్రత్తలనేవి మనుషుల జీవన విధానం అయినప్పుడే కరోనా మన దరిదాపుల్లోకి రాదు. ఆ విషయాన్ని గుర్తెరిగింపజేయడం కోసం ప్రజలకు విస్తృతంగా తెలియజెప్పాలి. కేంద్రం చేపట్టే తదుపరి కార్యక్రమం అదే. ప్రసార,ప్రచార సాధనాల ద్వారా ఇప్పటికీ కరోనా జాగ్రత్తల గురించి జనానికి తెలియజేస్తూనే ఉన్నారు. కరోనా తొలగి పోవడం లేనట్టే, జాగ్రత్తలకు కూడా అంతం ఉండకూడదనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతి పెరగడంతో ఊహించిన దాని కన్నా మరో వేవ్‌ రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ ఉపరకాలు మరోవేవ్‌కి కారణం కావచ్చని పేర్కొంటున్నారు. అయితే దక్షిణాఫ్రికా పరిస్థితితో మనకు పోలిక లేదు. అక్కడ దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్‌ అందలేదు. కోవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement