Tuesday, April 30, 2024

నేటి సంపాదకీయం-ఉచిత రేషన్‌ కొనసాగాలి..

కేంద్రం దీపావళికి ముందు పెట్రోల్‌, డీజెల్‌ ధరలను తగ్గిస్తూ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. అలాగే , వంటనూనెల ధరలను తగ్గించడం కూడా సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విషయమే.దేశంలో కోట్లాది మంది ఆధారపడిని ఆహార ధాన్యాల ఉచిత రేషన్‌ను నవంబర్‌ 30 తర్వాత కొనసాగించేది లేదంటూ కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి శుక్రవారం నాడు ప్రకటించి ప్రజలను తీవ్ర నిరుత్సాహ పర్చింది. ఉచిత రేషన్‌ విధానాన్ని కరోనా వేళ కేంద్రం ప్రవేశపెట్టిన మాట నిజమే. కరోనా తగ్గిపోయింది కనుక, ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతున్నాయి కనుక ఉచిత రేషన్‌ కొనసాగింపు సాధ్యం కాదంటూ కేంద్రం స్పష్టం చేయడంలో కేంద్రం కారణాలు కేంద్రానికి ఉండవచ్చు.

కానీ, ప్రస్తుతం కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి వర్ణించినట్టుగా సామాన్యుల పరిస్థితి ఏమంత మెరుగుకాలేదు. కరోనా విజృంభణ తగ్గిన మాట నిజమే కానీ, దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదని ప్రధాన మంత్రే స్వయంగా అంగీకరించారు. అంతేకాకుండా ఈ బాధ్యత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాలనీ, ఆరోగ్య సిబ్బందిని ఇంటింటికీ పంపి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కరోనా పూర్తిగా తగ్గనిదే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనీ, జీవన ప్రమాణాలు క్రమంగా పెరుగుతున్నాయని ఎలా చెబుతారు? పైగా ఇది రాజకీయ పరమైన నిర్ణయం దీనిపై కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి ప్రకటన చేయడం ఈ ప్రతిపాదనను జనం మీదికి వదిలితే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామనే అయి ఉండవచ్చు.

ప్రధానమంత్రి వంటనూనెల ధరలను కూడా పండుగ ముందు తగ్గించారు. దీపావళి పండుగ సందర్భంగా మిఠాయి, తీపి వస్తువుల విని యోగం ఎక్కువగా ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకునే వంటనూనెల ధరలను తగ్గించి ఉండవచ్చు. అంతేకాకుండా కరోనాకు ముందు వంటనూనెల ధరలను కేంద్రం విపరీతంగా పెంచింది. అలాగే, డీజెల్‌, పెట్రోల్‌ ధరలను కొద్దికొద్దిగా పెంచుకుంటూ వచ్చి లీటర్‌కి 25 రూపాయిల వరకూ పెంచేసింది. దానిలో కొంత సొమ్మును ఇప్పుడు తగ్గించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తదితర పన్నులు తగ్గించుకోవాలన్న డిమాండ్‌ వచ్చినప్పుడు కేంద్రం తగ్గించింది మూరెడు, పెంచింది బారెడు అంటూ రాష్ట్రాలు వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ, కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంపును ఆసరాగా తీసుకుని పెట్రోల్‌ ఉత్పత్తులపై రాష్ట్రాలు దోపిడీ చేస్తున్నాయంటూ వామపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రేషన్‌ను కట్‌ చేస్తామంటే సామాన్యులు ఎలా సంతోషిస్తారు? ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోఉంచినప్పుడే ఏ ప్రభుత్వాన్ని అయినా ఆదరిస్తారు.దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ దేశ సరిహద్దులలో ఆర్మీ జవాన్లతో దీపావళి జరుపుకున్నారు. 130 కోట్ల మంది అభినందనలనూ, ఆకాంక్షలనూ తీసుకుని వచ్చానంటూ చెప్పి జవాన్లను ఆనంద పర్చారు. అదే సందర్భంలో దేశ ప్రజలకు కాస్తో కూస్తో ధరలు తగ్గించి ప్రజలు ఆనందించేట్టు చేశారు. అయితే, ఈ ఆనందం ఎంతో సేపు పట్టకుండా కేంద్రం రేషన్‌ కొనసాగించే ప్రతిపాదన లేదనడం దానిని ఆవిరిపోయేట్టు చేయడమే. కరోనా తగ్గిన ప్రాంతాల్లో ప్రజలు ఆహార పదార్ధాలనే కాదు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసుకుంటున్న మాట నిజమే.

అంతమాత్రాన ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని ఎలా నిర్ధారిస్తారు? ఉచిత రేషన్‌ను గత సంవత్సరం మార్చిలో ప్రధానిప్రకటించారు,కనీసం ఏడాది కూడా దానిని అమలు జరపకుండా మధ్యలో నిలిపివేయడం సమంజసం కాదు. అంతేకాకుండా, కరోనా వల్ల మరణించిన వారికుటుంబాలకు సాయం అందిస్తామనిచెప్పిన కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆ సాయాన్ని అందించలేదు. రాష్ట్రాలు వాటి అజెండా ప్రకారం నిధులను కేటాయిస్తు న్నాయే తప్ప దేశంలో పరిస్థితిని ఆసరాగా చేసుకుని చేయడం లేదు.ఈ విషయమై కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపడం అవసరం. విదేశీ పర్యటనలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేదు కానీ, అదే సందర్భంలో అంతర్గత పరిస్థితులపై కూడా ప్రధాని దృష్టిని కేంద్రీకరించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement