Wednesday, April 24, 2024

రాజకీయ కక్షతోనే ఈడీ కేసు..

ఢిల్లి మంత్రి సత్యేంద్ర జైన్‌ కేసు చాలా పాతది. ఆయన ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇప్పుడే ఎందుకు అరెస్టు చేశారు? ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. సత్యేంద్ర జైన్‌ నివాసంలో గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినా ఏమీ దొరకలేదనీ, ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే సోదాలు చేసుకో వచ్చని కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. తాను ఊహించినట్టే జరిగిందని ఆయనఅన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకోసం ఈడీనీ, సీబీఐని వాడుకుంటోందన్న తన ఆరోపణ నిరాధారం కాదని రుజువైందని ఆయన అన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు,బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఇదే మాదిరి ఆరోపణలు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌,తదితర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయంగా దెబ్బతీయడం కోసమె ఈ అరెస్టు చేశారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. పంజాబ్‌ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, అక్కడి ఓటర్లు తమ పార్టీకే ఓటు వేశారనీ, గుజరాత్‌లో కూడా తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ లో ఈసారి బీజేపీ గెలుపొందడం కష్టమని అక్కడి నుంచి అందిన సర్వేనివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందు కోసమే పటేల్‌ సామాజిక వర్గం కోసం పోరాడిన హార్దిక్‌ పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు ఎన్నో తంటాలు పడి చివరికి ఆయనను ఒప్పించారు. పటేల్‌ సామాజికవర్గం తరఫున హార్దిక్‌ పటేల్‌ గుజరాజ్‌ లో ఆందోళనను నిర్వహించింది బీజేపీకి వ్యతిరేకంగానే నన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకుని బీజేపీలో చేరేందుకు సిద్ధ మవడం అక్కడి స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వారంతా ఇప్పుడు ఆప్‌ అభ్యర్ధులను బలపర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంతెలుసుండే ఆప్‌ పార్టీని దెబ్బకొట్టేందుకు ఈడీని కేంద్రం పురికొల్పిందన్న కేజ్రీవాల్‌ ఆరోపణ వాస్తవానికి దగ్గరగానే ఉంది. గజరాత్‌ ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడం వల్ల అక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సారి పటేల్‌ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించేందుకు నిర్ణయించింది. సత్యేంద్ర జైన్‌కి సంబంధించిన కేసు ఆరేళ్ళ క్రితం నాటిది.మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారని ఈడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.రెండు నెలల క్రితం ఆయనకూ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 4.81 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఈ మధ్య కాలంలో మనీ ల్యాండరింగ్‌ కేసులు ఎన్నో నమోదు అయ్యాయి.

వాటి దర్యాప్తు విషయంలో వేగంపెంచని ఈడీ అధికారులు సత్యేంద్ర జైన్‌ను ఇప్పు డే ఎందుకు అరెస్టు చేశారన్న కేజ్రీవాల్‌ ప్రశ్న హేతుబద్ద మైనదే. తన మేనల్లునిపై కూడా ఇదే మాదిరిగా పాత కేసు తవ్వి ఆయనను ఇబ్బంది పెడుుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాజ్యసభలో తమ పార్టీ బలాన్ని పెంచుకు నేందుకుబీజేపీ అన్ని వ్యూహాలను అమలు జేస్తోంది. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఓట్లను గండి కొట్టడానికి మీడియా అధిపతి సుభాస్‌ చంద్రను బరిలోకి దింపింది. ఆయనకు మద్దతు ప్రకటించింది.అలాగే, ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్దుల విజయావకా శాలను దెబ్బతీసేందుకు వ్యూహాలను అమలుజేస్తోంది. ఈ విషయాన్ని బహిరంగంగా అన్నందుకే కేజ్రీవాల్‌పై కమలనాథులు కక్షకట్టారు. పంజాబ్‌లో ఆప్‌ పార్టీ విజయం సాధిస్తుందని కమలనాథులు ఊహించలేదు. గుజరాత్‌లో ఆప్‌కి కాస్తోకూస్తో బలం ఉంది.గోరక్షకుల పేరిట దళితవర్గాలపై దాడులు జరిగినప్పుడు ఆప్‌ అండగా నిలిచింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీన పడి ఆప్‌ బలపడటంతో కమలనాథులు ఇప్పుడు ఆప్‌పై దృష్టి సారించారు. అయితే, కేజ్రీవాల్‌ ఇప్పటికే గుజరాత్‌ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభిం చారు. 2016 నాటి మనీ ల్యాండరింగ్‌, హవాలా కేసులో ఆయనను ఇప్పుడు అరెస్టు చేయడం రాజకీయ కక్షగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఆప్‌ ఎదగడం బీజేపీకి కలవరాన్ని కలిగిస్తున్న మాటనిజమే, అంతేకాకుండా పంజాబ్‌లో అధికారంలోకే వచ్చిన వెంటనే ఆప్‌ ముఖ్యమంత్రి మాన్‌ తీసుకుంటున్న చర్య లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.ఇటీవల ఒక మంత్రి లంచం తీసుకుంటున్నట్టు ఆధారాలు లభ్యం కావడంతో మంత్రిని ముఖ్యమంత్రి బర్తరఫ్‌ చేశారు.ఆప్‌ అవినీతికి అతీతం కాదని రుజువుచేయడం కోసం పాత కేసును తవ్వి తీశారు. సత్యేంద్రకుమార్‌ జైన్‌కు మమతా బెనర్జీతో రాజకీయ సంబంధాలు ఉన్నాయన్న అనుమానం కూడా ఆయన అరెస్టుకు కారణంగా భావిస్తునారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement