Thursday, October 3, 2024

Editorial – గ‌వ‌ర్న‌ర్ల‌కు హిత‌వు…

గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనదే అయినా, గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తమవరకూ రాకుండా గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సుప్రీం కోర్టు పంజాబ్‌ గవర్నర్‌కి చేసిన సూచన దేశంలోని గవర్నర్లందరికీ వర్తిస్తుంది. గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణ ఈనాటిది కాదు. చరిత్రలోకి వెళ్తే, అలనాడు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌లాల్‌ తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామా రావు నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటి నుంచి వివాదాస్పదమవుతోంది.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గవర్నర్‌లను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి రాజ్యాంగం లోని 356 అధికరణాన్ని ఎన్నోసార్లు ఉపయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో బీహార్‌ గవర్నర్‌గా వ్యవహరించిన బూటాసింగ్‌ వివా దాస్పద పాత్ర గురించి ఇప్పటికీ సందర్భం వచ్చినప్పు డల్లా చెప్పుకుంటూ ఉంటారు.ఆ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ గవర్నర్ల వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ను నియమించింది.

రాష్ట్ర ప్రభుత్వాల రద్దుకు కేంద్రానికి గవర్నర్లు చీటికీమాటికీ సిఫార్సు చేయకుండా, కట్టుదిట్టమైన సిఫార్సులు చేసింది. ఆ తర్వాత 356 అధికరణం వినియోగం జోరు తగ్గినప్పటికీ, బీజేపీ కూడా తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను సాగనంపేందుకు గవర్నర్లను ఉపయో గిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వాల రద్దుకు సిఫార్సు చేయడానికి బదులు గవర్నర్లు వాటిని ఇబ్బంది పెట్టేందుకు తమ అధికారాలను వినియోగిస్తున్నారు. శాసనసభ ఆమోదించిన తీర్మానాన్నీ లేదా బిల్లును గవర్నర్‌ ఆమోదించి తీరాలి. లేదా, వాటిలో సవరణ ల ను ప్రతిపాదించాలి. అవేమీ చేయకుండా నెలల తర బడి వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం అనేది ఇటీవల కాలంలో గవర్నర్లు చేస్తున్న చర్య. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, తెలంగాణ గవర్నర్‌ తమిళసై, పంజాబ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ ఇంకా మరి కొందరు గవర్నర్లపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నా యి. తాజాగా పంజాబ్‌ గవర్నర్‌ పురోహిత్‌ పంజాబ్‌ శాసనసభ ఆమోదించిన 27 బిల్లులలో 22 బిల్లులను ఆమో దిం చారు. మిగిలిన ఐదు బిల్లులు ఆర్థిక సంబం ధమైనవి. ఆర్థిక సంబంధమైన బిల్లులకు గవర్నర్‌ ఆమో దం తప్ప నిసరి. ఈ ఐదింటిలో ఫిస్‌కల్‌ రెస్పాన్స్‌బిలిటీ బిల్లు చాలా ముఖ్యమైనది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని గవర్నర్లు తమ పరిధిలోని అధికారాలను వినియోగించు కుం టూనే, ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రభుత్వం ఆమోదించే బిల్లుల్లోని మంచిచెడ్డలను పరిశీలించి తగిన సూచనలు చేయ వచ్చనీ, సలహాలు ఇవ్వొచ్చనీ, మొత్తంగా బిల్లులను ఆపి వేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదని కూడా స్పష్టం చేసింది. ఆ మాట నిజమే. గవర్నర్లుగా గతంలో రిటైర్డ్‌ న్యాయ మూ ర్తులనూ, రాజ్యాగ కోవిదులను కేంద్రం నియ మించేది. రాజకీయాల్లో రిటైరైన వారిని గవర్నర్లుగా నియమించే సంప్రదాయం ఇందిరాగాంధీ హయాంలోనే ప్రారంభ మెంది. అప్పట్లో ఈ విధానాన్ని తూర్పారబట్టిన ఆనాటి భారతీయ జనసంఘ్‌ బీజేపీ అవతారమెత్తిన తర్వాత ఆనాటి సంఘ్‌ నాయకులను గవర్నర్లుగా చేసింది. వారిలో రామ్‌నాయక్‌, తెలుగు రాష్ట్రాలకు చెందిన వి.వి. రామారావు, సి.హెచ్‌.విద్యాసాగరరావు, ఓం ప్రకాష్‌ కోహ్లీ తదితరులు ఉన్నారు. అయితే, వీరిపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాలే తప్ప, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విధేయులుగా వ్యవహరించకూడదని సుప్రీం కోర్టు గతంలో పలుమార్లు హెచ్చరించింది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ద్రవిడ సంస్కృతిపై గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వినియోగించుకుంటామని స్టాలిన్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఈలోగా గవర్నర్‌ని మార్చవద్దంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన ఒక లేఖ కూడా రాశారు.
కేరళలో అక్కడి గవర్నర్‌, ముఖ్యమంత్రిలకు మధ్య తగాదా సాగుతోంది. ఢిల్లి లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కీ, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. . పశ్చిమ బెంగాల్‌లోనూ అక్కడి ప్రభుత్వానికి, గవర్నరక్‌ అంత సంఖ్యత లేదు. ఇంకా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వానికి విధేయులుగా వ్యవహ రిస్తుండటం వల్ల తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. సుప్రీంకోర్టు తాజా సూచనలు భవిష్యత్‌లో గవర్నర్లు గీత దాటకుండా ఉండేందుకు ఉపకరిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement